కోదండం సారూ!...పొత్తుల్లేకుండా మ‌ద్ద‌తెలాగండీ?

Update: 2019-03-13 15:56 GMT
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించ‌డంలో నాడు ఉస్మానియా వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌ గా ప‌నిచేసిన కోదండరాం పాత్ర కీలక‌మ‌నే చెప్పాలి. అప్ప‌టిదాకా టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో సాగుతున్న ఉద్య‌మంలోని విద్యార్థి లోకం పెద్ద‌గా జ‌త చేర‌లేదు. ఎప్పుడైతే ప్రొఫెస‌ర్ కోదండ‌రాం బ‌రిలోకి దిగారో... విద్యార్థి లోకంతో పాటు మేధావులు కూడా టీఆర్ ఎస్‌ తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌ప‌డ్డారు. మొత్తంగా ప‌దేళ్ల‌కు పైగానే తెలంగాణ కోసం పోరాడుతున్న టీఆర్ ఎస్ కు కోదండ‌రాం చేరిక‌తో మంచి బ‌ల‌మే వ‌చ్చింది. మేధావిగా మంచి పేరున్న కోదండ‌రాంకు కేసీఆర్ కూడా మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. ఉద్య‌మంలో కోదండ‌రాంతో క‌లిసి న‌డిచారు. ఉమ్మ‌డిగా రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే ఆ త‌ర్వాత తెలంగాణ‌కు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేసీఆర్‌.. క్ర‌మంగా కోదండ‌రాంకు పొగ‌బెట్టేశారు. అంతేనా కోదండం సారును ఏకంగా జైలులోనూ పెట్టించే య‌త్నం చేశారు. ఈ త‌ర‌హా కేసీఆర్ వ్యూహాల‌తో చిర్రెత్తుకొచ్చిన కోదండ‌రాం... తెలంగాణ జ‌న‌స‌మితి పేరిట పార్టీ కేసీఆర్‌ కు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు య‌త్నించారు.

అయితే కేసీఆర్ వ్యూహాల ముందు కోదండ‌రాం ఎందుకూ కొర‌గాకుండానే పోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీజేఎస్‌ కు ఒక్క సీటు కూడా ద‌క్క‌క‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. అయితే ఇంత జ‌రిగినా... కోదండ‌రాంకు రాజ‌కీయంగా ఆశ‌లు చావలేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలోనూ దిగేందుకు కోదండ‌రాం ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇక్క‌డే ఆయ‌న  మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లోని మొత్తం సీట్ల‌లో పోటి చేసే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని ఓ నాలుగైదు స్థానాల్లోనే పోటీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. నిజామాబాద్ - కరీంనగర్ - మల్కాజిగిరి సహా.. మరో ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన వివరించారు. అంత‌టితో ఆగ‌ని కోదండం సారు... మ‌రో ఇంట‌రెస్టింగ్ పాయింట్ ను కూడా ప్ర‌స్తావించారు. తాము పోటీ చేసే నాలుగైదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తే తీసుకుంటామ‌ని - తాము అయితే మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కోర‌మ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇక తాము పోటీ చేసే మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు త‌మ శ్రేణులు మ‌ద్ద‌తుగా నిలుస్తాయ‌ని కూడా కోదండ‌రాం చెప్పారు. కాంగ్రెస్ నుంచి మద్ద‌తును ఇచ్చిపుచ్చుకునేందుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని చెప్పిన ఆయ‌న... కాంగ్రెస్ స‌హా ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేద‌ని తేల్చేశారు. పొత్తు ఉన్నా... మ‌ద్ద‌తు విష‌యంలో స్ప‌ష్ట‌త లేని ప్ర‌స్తుతం కాలంలో... పొత్తు లేకుండా మ‌ద్ద‌తు ఎలా కొనసాగుతుందో కోదండం మాస్టారికే తెలియాలి అన్న వాద‌న వినిపిస్తోంది. ఇక కోదండ‌రాం ఎంచుకున్న స్థానాల‌ను చూస్తే మ‌రో అనుమానం కూడా వ‌చ్చేస్తోంది. కోదండం మాస్టారి నోట వినిపించిన మూడు స్థానాలు కూడా టీఆర్ ఎస్‌ కు మంచి ప‌ట్టున్న స్థానాలే. నిజామాబాద్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకే ద‌మ్ము లేకుంటే... కోదండ‌రాం సారుకు ఏ ప్రాతిప‌దికన ఈ స్థానాలు గుర్తుకు వ‌చ్చాయో - ఏ ప్రాతిప‌దిక‌న పోటీ చేయాల‌ని తీర్మానించారో అర్థం కావ‌ట్లేద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News