కేసీఆర్ కు కోదండం మార్క్ షాక్

Update: 2015-10-13 15:31 GMT
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ అధికారపక్షానికి భారీ షాక్ ఇవ్వనున్నారా? విపక్షాలు చేయలేని పనిని.. కోదండం ఒక్కరే చేయనున్నారా? తాజాగా హైకోర్టులో ఆయన వేసిన పిటీషన్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంలో కోదండం మాష్టారు ఇంప్లీడ్ పిటీషన్ వేయటం తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కేలా చేసింది.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తరఫున పోరాడారన్న పేరున్న కోదండరాం.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక ఉద్యమకారుడిగా ఉండిపోయారే తప్పించి.. చాలామంది మాదిరి పేరు కోసం.. పదవుల కోసం వెంపర్లాడింది లేదు. అందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాదు.. పదవుల్ని చేపట్టేందుకు ఆయన ఆసక్తి కూడా ప్రదర్శించలేదు.

తెలంగాణ సాధించిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో పిల్లలకు పాఠాలు చెబుతూ.. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన ఆయన.. తెలంగాణ సర్కారు మీద మొదట్లో ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారు కాదు. ఈ మధ్యన ఆయన టోన్ లో కాస్త తేడా వచ్చింది. ప్రొఫెసర్ గా రిటైర్ అయిన ఆయన.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో పలు జిల్లాల్లో పర్యటించారు.

వారం రోజుల క్రితం వ్యవసాయ జన చైతన్య సమితి రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో పిటీషన్ వేసింది. తాజాగా కోదండరాం.. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించేలా తెలంగాణ సర్కారు తీరు ఉందని జన చైతన్య సమితి తన పిటీషన్ లో పేర్కొనటం గమనార్హం.  

ఈ పిటీషన్ కు ఇంప్లీడ్ పిటీషన్ వేసిన కోదండరాం.. రైతు ఆత్మహత్యలు పెరిగాయని.. ఈ అంశంపై తాము సమగ్ర సర్వే నిర్వహించామని.. తమ వద్ద నివేదిక ఉందని పేర్కొన్నారు. మరి.. ఈ నివేదిక కానీ బయటకు వస్తే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు సరికొత్త తలనొప్పులు గ్యారెంటీ అన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News