కేసీఆర్‌పై పిటిష‌న్ వేసిన కోదండ‌రాం

Update: 2015-11-11 18:53 GMT
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నంత‌ప‌ని చేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో  రాజ‌కీయాల‌కు అతీతంగా అన్నివ‌ర్గాలను ఏకంచేసి ముందుండి న‌డిపించడంలో కోదండ‌రాం కీల‌క పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత కోదండరాం ఏ ప‌ద‌వులు చేప‌ట్ట‌కుండా తిరిగి ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పి కొద్దికాలం క్రితం రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజాసంక్షేమం కోణంలో అభినందిస్తూ, అవ‌స‌ర‌మైతే వ్యతిరేకిస్తూ ఉంటాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఇటీవల కోదండరాం రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంతేకాకుండా బ‌హిరంగ విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం(పీపీఏ)పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... దీనిపై బహిరంగ విచారణ జరపాలని కోదండరాం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్‌సీ)ని కోరారు. ఈమేర‌కు కోదండరాం నేతృత్వంలో టీజేఏసీ ప్రతినిధుల బృందం టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. కోదండ‌రాం ఒక్క‌రే వెళ్ల‌కుండా టీఎన్జీవోల అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టీజీవోల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త కె.రఘు తదితరుల‌ను వెంట‌బెట్టుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం అంద‌జేసిన లేఖ‌లో ఏముందంటే...ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పంపిణీ సంస్థ(సీఎస్‌పీడీసీఎల్), తెలంగాణ డిస్కం మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వస్తున్న వార్తలు, ఈఆర్‌సీలో దాఖలైన అభ్యంతరాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం యథాతథంగా అమలైతే విద్యుత్ వినియోగదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడనుంద‌ని వివ‌రించారు. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో వివాదాస్పద అంశాలపై అర్థవంతమైన పరిష్కారాల కోసం ఛత్తీస్‌గఢ్ పీపీఏపై బహిరంగ విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని ఆ లేఖ‌లో కోరారు.

కొద్దికాలం క్రితం వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ఇరుకున్న పెట్టిన రైతు స‌మ‌స్య‌ల‌పై పిటిష‌న్ వేసిన కోదండరాం... ప్ర‌స్తుతం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ఛత్తీస్‌గఢ్ పీపీఏ విష‌యంలో నేరుగా ఫిర్యాదు చేయ‌డమే కాకుండా బ‌హిరంగ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వాధినేత‌గా కేసీఆర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్ట‌డం అంటే డైరెక్టుగా స‌వాల్‌కు సిద్ధ‌మ‌యిన‌ట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పిటిష‌న్ ఇచ్చిన కోదండ‌రాం దీనికి రాజ‌కీయ కోణం క‌ల్పించ‌వ‌ద్దంటూ సున్నితంగా త‌ప్పించుకున్నారు. పీపీఏను తామేమీ తప్పుపట్టడం లేదని, దీనిపై వస్తున్న అభ్యంతరాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని కోదండ‌రాం చెప్పారు.
Tags:    

Similar News