17 సీట్లు స‌రిపోతాయా?..మ‌రో ప‌ది సీట్లు అవ‌స‌ర‌మా సార్‌?

Update: 2018-11-03 05:16 GMT
అడిగే దానికి అర్థం ఉండాల‌న్న మాట‌ను కోదండం మాష్టారు పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు. తాజాగా ఆయ‌న మాట‌ల్ని చూస్తుంటే.. త‌న పార్టీ బ‌లం ఎంత‌న్న విష‌యం ఆయ‌న‌కు త‌ప్ప అంద‌రికి అర్థ‌మైన‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాట్లు ఎప్పుడో జ‌రిగి పోయిన‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి బ్రేకులు వేసేలా ఆయ‌న తాజా మాట‌లున్నాయి.

కూట‌మిలో సీట్ల స‌ర్దుబాటుపై ఇప్ప‌టివ‌ర‌కూ వినిపించిన మాట‌ల‌కు భిన్న‌మైన వ్యాఖ్య‌లు కోదండం నోటి నుంచి వ‌చ్చాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కూట‌మి ఏర్పాటు ఆల‌స్య‌మైతే అన్ని పార్టీల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. ఇదే విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెప్పారు. సీట్ల స‌ర్దుబాటుపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోవాల‌న్న విష‌యాన్ని రాహుల్ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు చెప్పారు. సీట్ల స‌ర్దుబాటు లెక్క‌లు ఇంకా పూర్తి కావ‌టం లేద‌న్న కోదండం.. తాము 17 స్థానాలు కోరామ‌ని.. 15 స్థానాల్లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ కోదండం పార్టీకి ప‌ది లోపు.. ఆ మాట‌కు వ‌స్తే 8 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వ‌లేన‌న్న మాట‌ను కాంగ్రెస్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటివేళ‌.. ఆయ‌న ఏకంగా డ‌బుల్ స్థానాల్నిఅడ‌గ‌టం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ‌లో ఏ నిరంకుశ పాల‌న వ‌ద్ద‌ని అనుకున్నామో.. ఇప్పుడు అలాంటి పాల‌న‌కు కృషి చేస్తున్న‌ట్లు చెప్పిన కోదండం.. పార్టీ నిర్మాణం లేకుండా సీట్లు అడ‌గ‌టం లేద‌న్నారు.

తెలంగాణలో తెలంగాణ జ‌న‌స‌మితి పాతిక చోట్ల బ‌లంగా ఉన్న‌ట్లుగా చెప్పారు. ఇంత‌కీ మీరు ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు తెలివిగా బ‌దులిచ్చిన కోదండం.. పోటీ వ్య‌క్తుల కేంద్రంగా ఉండ‌కూద‌ని చెబుతూ.. తాను ఎక్క‌డ నుంచి పోటీ చేసే విష‌యాన్ని హైద‌రాబాద్‌ లో వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఓవైపు కోదండం మాష్టారి పార్టీలో ఆయ‌న త‌ప్పించి ప్ర‌ముఖంగా గుర్తు ప‌ట్టే నేత‌లు ఒక‌రిద్ద‌రు కంటే ఎక్కువ‌గా లేని వేళ‌.. ఆయ‌న మాత్రం ఏకంగా 15 సీట్లు కోరుతున్న తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మ బ‌లం ఎంత‌న్న విష‌యాన్ని గుర్తించి సీట్లను కోరాల్సిన దానికి భిన్నంగా.. కోదండం మాష్టారి నోటి నుంచి మాట‌ల తీరు చూస్తుంటే.. కూట‌మి లెక్క‌ల్ని రానున్న వారంలో తేల్చ‌కూడ‌ద‌న్నట్లుగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. కోదండం నోటి నుంచి వ‌చ్చిన ప‌దిహేడు సీట్ల మాట‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్యంగ్య వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 17 స‌రిపోతాయా? మ‌రిన్ని సీట్లు కావాలా? అన్న ఎట‌కారాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే.. వ్యూహాత్మ‌కంగానే కోదండం మాట్లాడార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి సీట్ల స‌ర్దుబాటుపై కోదండం నోటి నుంచి వ‌చ్చిన 17 సీట్ల మాట మాత్రం షాకింగ్ గా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News