సార్ డెసిషన్ ‘ఏకీకరణ’కు నష్టం కాదా?

Update: 2017-11-11 23:30 GMT
తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన వ్యూహకర్త, మేధావి ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీని ప్రకటించడానికి సమాయత్తమవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన తెలంగాణ ఐక్య కార్యాచరణ కన్వీనర్ గా ఉద్యమాన్ని నడిపించడంలో సఫలీకృతమయ్యారు.  ఆశాజనకంగా తెలంగాణ వేరుపడింది. కలసాకారమైంది. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిస్థితులు అనుకూలించలేదు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆచార్య కోదండరామ్ క్రియాశీలకపాత్ర పోషించినప్పటికీ... అనివార్యకారణాలతో కోదండరామ్ జాయింట్ యాక్షన్ కమిటీనే అంటిపెట్టుకుని కొనసాగుతున్నారు. అయితే పోరాటపథంలో ఉన్న కోదండరాం తనకంటూ సొంత పార్టీ పెడితే దానివల్ల కేసీఆర్ కు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కోదండరామ్ పై ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇటీవల నిప్పులు చెరిగారు. రాజకీయ పార్టీలన్నీ కేసీఆర్ నోటి దురుసును తప్పుబట్టాయి. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాజకీయాలంటే స్వతహాగా ఇష్టంలేని కోదండరామ్... అనుచరుల ఒత్తిడితో రాజకీయ పార్టీనాయకుడిగా తెలంగాణ గడ్డపై సంచలనం సృష్టించబోతున్నారు.

తెలంగాణ గడ్డపై తొలిసారిగా అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్రసమితి నిరంకుశంగా వ్యవహరిస్తోందని రాజకీయశక్తుల పునరేకీకరణ జరుగుతూ ఉంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెరాస అధినేత కేసీఆర్ ను వ్యతిరేకించే వారినందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీ తరఫున శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆటమొదలైందని రేవంత్ రెడ్డి ప్రకటించి తెరాస గద్దె దింపడమే లక్ష్యంగా రాజకీయ శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెరాసలో అసమ్మతివాదులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలుకూడా మొదలయ్యాయి. రెడ్డి సామాజిక వర్గానికి  కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేందేకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఈనేపథ్యంలో ఆచార్య కోదండరామ్ రాజకీయ ప్రకటనకు సమాయాత్తం కావడం ... నాయకులను ఆలోచనలో పడేసింది. కొత్త పార్టీ పుట్టుకొస్తే ‘కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ’కు విఘాతం కలుగుతుందన్న అనుమానం రేకెత్తిస్తోంది. తెరాస ఆటకట్టించేందుకు రాజకీయ శక్తులు ఐక్యంగా ఉంటేగానీ సాధ్యం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీ ఆలోచన విరమించి పునరేకీకరణలో భాగస్వామ్యమైతే లక్ష్యం నెరవేరుతోందన్న అభిప్రాయం ఒక వర్గంలో వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News