కేసీఆర్ పై కోదండరాం ‘‘ధర్మ’’ యుద్ధం షురూ

Update: 2015-11-17 07:02 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తెలంగాణ జేఏసీ సమన్వయకర్త ప్రొఫెసర్ కోదండరాం ధర్మయుద్ధాన్ని షురూ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంలో తనను చేర్చుకోవాలంటూ కోదండరాం పేర్కొనటం తెలిసిందే. తాజాగా ఈ కేసు సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. నిజానికి ఈ వాజ్యంలో కోదండరాంతో పాటు.. పలువురు సామాజికవేత్తలు పార్టీలుగా మారారు.

ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలపై ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వైఖరిపై తమకున్న అభ్యంతరాలు తెలిపారు. ఇక.. కోదండరాం విషయానికి వస్తే.. ఆయన కేసీఆర్ సర్కారు మీద ధర్మ యుద్ధాన్ని ప్రకటించినట్లు చెప్పాలి. ఎందుకంటే.. రైతుల ఆత్మహత్యల నివారణకు కీలకమైన కరవు మండలాల గుర్తింపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ చేపట్టలేదని కోదండరాం తరఫు న్యాయవాది తన వాదనను తెరపైకి తీసుకొచ్చారు.

నిజానికి ఇలాంటి వాదననే.. తెలంగాణ బీజేపీ నేతలు సైతం ప్రజాక్షేత్రాల్లో వినిపించటం తెలిసిందే. అయితే.. కోదండరాం తరఫున టీఆర్ ఎస్ సర్కారుపై వినిపించిన వాదనలో నిజం లేదని.. కరవు మండలాల్ని గుర్తించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. దానికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరటంతో హైకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. చూస్తుంటే.. తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం.. వైఫల్యమే కారణమన్న వాదనను వినిపించేందుకు కోదండరాం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News