కోడెల‌కు షాకిచ్చిన క‌రీంన‌గ‌ర్ కోర్టు!

Update: 2018-10-04 11:50 GMT
మ‌హారాష్ట్ర‌లోని బాబ్లీ సంద‌ర్శ‌న విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా హాజ‌రు కావాల‌ని ధ‌ర్మాబాద్ కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ప‌లుమార్లు నోటీసులు ఇచ్చిన‌ప్ప‌ట‌కీ చంద్ర‌బాబుతో పాటు కొంద‌రు టీడీపీ నేత‌లు హాజరు కాలేద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కేసు వ్య‌వ‌హారం మీడియాలో న‌లుగుతున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత‌కు కోర్టు నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 10న క‌రీంన‌గ‌ర్ ప్ర‌త్యేక మెజిస్ట్రేట్ కోర్టులో స్వ‌యంగా హాజ‌రు కావాలంటూ కోడెల‌కు ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో కోడెల ఖ‌ర్చు పెట్టిన‌ రూ.11.50 కోట్ల వ్య‌వ‌హారంపై ఓ వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. ఆ పిటిష‌న్ పై కోడెల తెచ్చుకున్న స్టే గ‌డువు ముగియ‌డంతో తాజాగా క‌రీంన‌గ‌ర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2014 ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని ఓ ఇంట‌ర్వ్యూలో కోడెల స్వయంగా వెల్ల‌డించారు. ఆ పాయింట్ ను బేస్ చేసుకొని  సింగిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంత భారీ మొత్తం ఎందుకు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌చ్చింది? ఆ డబ్బు ఎక్క‌డ నుంచి వచ్చింది? అనే విష‌యాల‌ను ఐటీ అధికారులతో విచారణ జరపాలని పిటిషనర్‌ కోరారు. దానికి సంబంధించిన‌ ఆధారాలను కోర్టుకు భాస్క‌ర్ సమర్పించారు. దీంతో,ఎన్నికల నిబంధనల్లోని వివిధ సెక్షన్ల కింద కోర్టు విచారణ చేప‌ట్టింది. ఆ కేసు నుంచి హైకోర్టులో కోడెల స్టే తెచ్చుకున్నారు. కానీ, గత నెల 27తో ఆ స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా క‌రీంన‌గ‌ర్ ప్ర‌త్యేక మెజిస్ట్రేట్ కోర్టులో  హాజరు కావాలని కోడెల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మ‌రి, ఈ నేప‌థ్యంలో కోడెల స్వ‌యంగా హాజ‌ర‌వుతారా లేదా అన్న‌దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డింది.
Tags:    

Similar News