కోడెల ఆవేదన గాంధీనగర్ లో వినిపించింది

Update: 2016-01-23 04:33 GMT
తనకు ఎదురైన అనుభవాలతో ఏపీ స్పీకర్ చేస్తున్న ప్రతిపాదనలు షాక్ తినిపించేలా ఉన్నాయి. గాంధీనగర్ లో జరుగుతున్న సభాపతుల జాతీయ సదస్సులో ఏపీ స్పీకర్ చేసిన ప్రతిపాదనలు వణుకు పుట్టించేవే. కట్టుతప్పిన ప్రజాప్రతినిధుల మెడలు వంచేలా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారికి ముకుతాడు వేసేలా నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కోడెల మాటలు ఉన్నా.. ఆచరణలోకి వస్తే ఎంత ఇబ్బందన్న విషయాన్ని కోడెల దూరదృష్టితో ఆలోచించినట్లుగా అనిపించదు.

ఇప్పుడైతే అధికారంలో ఉన్నారు కాబట్టి.. నిబంధనలు కఠినంగా ఉండాలని భావించటంలో తప్పు లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేయటం విపక్షాలకు మామూలే. అయితే.. ఇలా పోడియం వద్దకు వచ్చిన సభ్యులు ఆటోమేటిక్ గా సస్పెన్షన్ వేటు పడేలా నిబంధనలు మార్చాలని కోడెల సిఫార్సుచేయటం గమనార్హం.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ బొత్తిగా లోపించినట్లుగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇలాంటి వైఖరికి చెక్ చెప్పటం.. స్పీకర్ స్థానాన్ని మరింత పవర్ ఫుల్ గా మార్చాలని కోడెల భావించటం బాగానే ఉన్నా.. తాను చేస్తున్న సిఫార్సులు అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారపక్షంగా ఉన్నప్పుడు విపక్షాలు చేసే ఆందోళన గొడవగా అనిపించటం సహజం. అయితే.. అధికారపక్షం శాశ్వితంగా ఉండదని..  ఇప్పుడు అధికారపక్షం రేపొద్దున్న విపక్షంగా మారినప్పుడు.. కోడెల చెప్పినట్లు నిబంధనల్ని కఠినం చేస్తే విపక్షం నోటి వెంట మాట బయటకు రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే.. ఆవేశంతో కానీ.. ఆవేదనతో కానీ తమ వాయిస్ వినిపించుకునేందుకు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళితే సస్పెన్షన్ వేటు పడితే.. విపక్షం నోటి వెంట మాట వచ్చే అవకాశమే ఉందన్న వాదన వినిపిస్తోంది. అత్యుత్సాహంతో విపక్షాలు చేసే ఆందోళనలకు ముకుతాడు వేయటం మంచిదే కానీ.. ఆ పేరుతో సభ్యులను నియంత్రిచాలని చూడటం సబబు  కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. కోడెల చేసిన తాజా సిఫార్సుకు సభాపతుల సమావేశం ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News