కోడెల స్ఫూర్తి : 30 రోజుల్లో 'అమరావతి అసెంబ్లీ'!

Update: 2015-10-14 04:15 GMT
ఒకవైపు నారా చంద్రబాబునాయుడు నభూతో నభవిష్యతి అనిపించేస్థాయిలో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయనలోని సత్‌ స్ఫూర్తిని అందిపుచ్చుకుని.. సదరు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి అప్పుడే ఇతర ప్రయత్నాలు కూడా అంతకంటె వేగంగానే మొదలైపోతున్నాయి. ప్రస్తుత అమరావతి ప్రాంతంలోనే ఈ ఏడాది శాసనసభ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని స్పీకరు కోడెల శివప్రసాదరావు నిర్ణయించడం పలువురికి మరింత స్ఫూర్తి ఇస్తోంది. అసెంబ్లీకి ఉండవలసిన ఏర్పాట్లు, హంగులు ఏమాత్రం తగ్గకుండానే తాత్కాలిక భవనాలను అర్జెంటుగా నిర్మింపజేసి.. డిసెంబరులో అయిదురోజుల పాటూ జరిగే అసెంబ్లీ సమావేశాలకు వేదికగా తీర్చిదిద్దాలని కోడెల శివప్రసాద్‌ సంకల్పిస్తున్నారు.

నిజానికి పదేళ్ల పాటూ హైదరాబాదులోని అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ అసెంబ్లీ కార్యకలాపాలకు కూడా వాడుకోవడానికి విభజన చట్టం ప్రకారం వెసులుబాటు ఉంది. అయితే.. ఇక్కడి అసెంబ్లీ భవనాలను పంచుకోవడంలో తొలిదశలోనే చాలా చికాకులు వచ్చాయి. ఏపీ స్పీకరు కోడెల శివప్రసాద్‌ రావు, తెలంగాణ స్పీకరు మధుసూదనాచారితో పలుమార్లు భేటీ అయి, మంతనాలు సాగించి గదులను, హాల్స్‌ ను పొందవలసి వచ్చింది. ఇవన్నీ ఆయనకు అప్పట్లోనే చికాకు తెప్పించాయి. అప్పటినుంచి కూడా వీలైనంత త్వరగానే.. ఏపీలోకి తన పరిధిలోని అసెంబ్లీ నిర్వహణను తరలించేయాలని ఆయన అనుకుంటూనే ఉన్నారు. గతంలోనే గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీ నిర్వహించాలని కూడా ప్రయత్నించారు. అయితే అక్కడి భవనాలు సరిపోవని, ఏర్పాట్లకు అనుకూలంగా లేదని తేలడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇప్పుడు అమరావతికి శంకుస్థాపన జరుగుతుండగా.. అసెంబ్లీని ప్రాథమికంగా అక్కడికే తరలించేయాలని అనుకుంటున్నారుట.

ఈమేరకు కొత్త టెక్నాలజీతో సత్వరం పూర్తయ్యే తాత్కాలిక భవనాన్ని నిర్మింపజేయాలని స్పీకరు పురమాయించార్ట. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారుట. 30రోజుల్లోనే అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయ్యేలా కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి ఇప్పటికే నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు కూడా ప్రారంభించేసినట్లుగా తెలుస్తోంది. తక్షణం రాజధాని అమరావతిలో కార్యకలాపాలు మొదలైపోయేలాగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి!!
Tags:    

Similar News