లోక్ సభకు కోడెల, అసెంబ్లీకి తనయుడు

Update: 2019-03-01 10:32 GMT
తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులను అధినేత చంద్రబాబు వేగంగా చేస్తున్నారు. ఏపీ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఈసారి అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు పంపేందుకు చంద్రబాబు నిర్ణయించారు. అదే సమయంలో అసెంబ్లీకి ఆయన కుమారుడు శివరాంను నర్సారావుపేట ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారట..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ సత్తనపల్లి నుంచి గెలుపొందారు.  అయితే పల్నాడు ప్రాంతంలో గట్టిపోటీ ఉన్న కోడెలను నర్సారావు పేట నుంచి ఎంపీగా పోటీచేయిస్తే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అయితే తాను ఎంపీగా వెళితే తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోడెల మెలికపెట్టినట్లు సమాచారం. దీనికి చంద్రబాబు ఒప్పుకొని నర్సారావుపేట ఎమ్మెల్యే టికెట్ ను కోడెల కుమారుడికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీపడడం లేదు. దీంతో ఆయన తనయుడికి సైతం అసెంబ్లీ సీటు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. రాయపాటి కొడుకు రాయపాటి రంగారావుకు కోడెల వదిలేస్తున్న సత్తెనపల్లి సీటు ఇచ్చేందుకు బాబు నిర్ణయించారు.

ఇక కోడెల నర్సారావుపేట ఎంపీగా బరిలో దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఆయనపై ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి  వైసీపీలో చేరి ఎంపీగా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదుగుల ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. ఆయన వైసీపీలో చేరుతున్నారు. మోదుగుల సత్తెనపల్లి సీటు ఆశిస్తున్నారు.కానీ జగన్ మాత్రం నర్సారావుపేట నుంచి ఎంపీగా బరిలోకి దించడానికి యోచిస్తున్నట్టు సమాచారం. 2009లో మోదుగుల ఇదే నర్సారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బాలశౌరిపై గెలిచారు. దీంతో మరోసారి కోడెలను ఢీకొట్టేందుకు వైసీపీ మోదుగుల అస్త్రాన్ని బయటకు తీస్తోంది.
 
Tags:    

Similar News