తెలుగు తమ్ముడు ‘చందాల’ దందా చేస్తున్నారట

Update: 2016-09-15 04:10 GMT
తెలుగు ప్రజలకు బొండా ఉమామహేశ్వరరావు కాస్త కొత్తే. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కూడా ఆయన పెద్దగా తెలీదు. అసెంబ్లీలో జగన్ బ్యాచ్ మీద ఒంటి కాలి మీద లేస్తూ.. తానేం మాట్లాడుతున్నానో తెలీకుండా మాట్లాడేసే వైఖరితో బొండా స్వల్ప వ్యవధిలో సుపరిచితుడయ్యారు. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో ఊగిపోయే బొండాలో ‘విషయం’ తక్కువే అయినా సౌండ్ ఎక్కువ కావటంతో తరచూ మీడియా కంట్లో పడుతుంటారు.

లాజిక్కులు పెద్దగా తీయలేరన్నవిమర్శ ఉన్న బొండాకు ఉన్న లక్షణం వాయిస్ తో విరుచుకుపడటమని చెబుతారు. అలాంటి బొండా మీద ఊహించని మరక ఒకటి పడింది. గణేశ్ ఉత్సవాల ముసుగులో ఈ తెలుగు తమ్ముడు చందాల దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్సవాల ముసుగులో చందాలు వసూలు చేస్తున్నట్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ఆరోపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వామపక్ష భావజాలాన్ని వినిపించే కోగంటి సత్యం లాంటి పారిశ్రామికవేత్త తాజాగా బొండా మీద ఫైర్ కావటం.. ఆయనపై ఆరోపణలు గుప్పించటం గమనార్హం. డూండిలో 72 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సొంతంగా రూ.60లక్షలు ఖర్చు చేస్తే.. పొలిటికల్ పవర్ తో బొండా ఉమ ఆ పేరు ప్రఖ్యాతుల్ని కబ్జా చేసినట్లుగా దుయ్యబట్టారు. విజయవాడలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. తనను ఏకపక్షంగా అరెస్ట్ చేసినట్లుగా మండిపడ్డారు.

డూండి గణేశ్ ను దర్శించుకునేందుకు చంద్రబాబు వస్తారని తాను అనుకోలేదని.. అయినా.. ఆయన రావటం సంతోషమేనని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని తేల్చేసిన కోగంటి.. బొండా ఉమ మీద వేసిన చందాల దందా మరక ఆయనకు కొత్త కష్టాలు తీసుకురావటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. తన మీద పడిన మరకకు బొండా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News