దేవుడ్ని క‌బ్జా చేసిన బోండా ఉమా

Update: 2016-09-17 06:21 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు చురుకైన పాత్ర గురించి చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగుదేశం పార్టీని ఇర‌కాటంలో ప‌డేసే సంద‌ర్భం వ‌చ్చిందంటే చాలు ఉమా ప్ర‌త్య‌క్షం అయిపోతారు. త‌న వాగ్దాటితో విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అయితే ఈ దూకుడును రాజ‌కీయాల‌కే ప‌రిమితం చేయ‌కుండా వ్య‌క్తిగ‌త క‌క్ష‌కు ఉప‌యోగించుకుంటున్నార‌ని విజ‌య‌వాడ‌లో చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా న‌గ‌రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం విష‌యంలో ఇది రుజువైంద‌ని ప‌లువురు చెప్తున్నారు.

విజయవాడలో రాకేష్‌ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో ఈ నెల 3వ తేదీన కోగంటి సత్యం అరెస్టయ్యారు. గన్నవరం స‌బ్ జైలు నుంచి తాజాగా ఆయన బెయిల్‌ పై విడుదలయిన సంద‌ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజకీయం ముసుగులో ఎమ్మెల్యే బోండా ఉమా తనపై అసత్యపు కేసు పెట్టించి, అరెస్టు చేయించారని ఆరోపించారు. న‌గ‌రంలోని ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో డూండీ గణేష్‌ సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి మరో రెండు రోజుల్లో ప్రారంభించదలచగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉత్సవాలను కబ్జా చేయాలని ప్రయత్నించారని సత్యం ఆరోపించారు.  ఈ ఏడాది స్థానిక ఎమ్మెల్యే విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం బాధాకరమన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి వత్తాసు పలకడం విచారకరమన్నారు.  ఆయన చేస్తున్న దారుణాన్ని ప్రశ్నించాననే అక్కసుతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారని పేర్కొన్నారు. కేసు విచారించి నిజనిజాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేశారని చెప్పారు. డూండీ గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తిలకించేందుకు గత ఏడాది 15 లక్షల మంది భక్తులు రాగా.. ఈ ఏడాది కేవలం 70 వేల మంది మాత్రమే వచ్చారని ఆయన తెలిపారు. దేవుడిని కబ్జా చేయాలని చూడటం దుర్మార్ఘమని పేర్కొన్నారు.

తాను తప్పు చేసి ఉంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యే బోండా కూడా ఈ సవాల్‌ కు ముందుకు రావాలని కోరారు. తన కోసం గత ఐదు రోజులుగా విజయవాడ పట్టణంలో రిలే దీక్షలు చేపట్టిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత ఆస‌క్తిక‌రంగా ఈ పారిశ్రామిక వేత్త‌కు స్థానిక సీపీఐ నేత‌లు - ఆప్‌ నేతలు - నగర డిప్యూటీ మేయర్ సైతం స్వాగ‌తం ప‌లికిన‌వారిలో ఉన్నారు.
Tags:    

Similar News