ఆ ఇన్నింగ్స్ ను తలచుకుంటూనే ఉన్న కోహ్లి

Update: 2022-11-26 15:10 GMT
బాగా దాహంతో ఉన్నవాడికి మంచినీళ్లు ఇస్తే.. ఆకలితో ఉన్నవాడికి పరమాన్నం పెడితే.. చలికి వణికిపోతున్నవాడికి వెచ్చటి కంబళి ఇస్తే.. ఇంకేం.. అతడికి ఎంతో గొప్ప ఉపశమనం. కొన్ని రోజుల పాటు దానిని తలచుకుంటూ ఉండిపోతాడు. ఇప్పుడదే ఊహల్లో ఉన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి. ఇటీవల ఫామ్ అందుకుని పరుగుల వరద పారిస్తున్న కోహ్లి.. మునుపటి కోహ్లిలా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆసియా కప్ లో తొలి టి20 సెంచరీ అందుకున్న అతడు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. అందులోనూ ఆ సెంచరీ దాదాపు మూడేళ్ల కిందట వచ్చింది కావడంతో మరింత విశేషమైంది. అదే కోహ్లి.. తాజాగా ముగిసిన టి20 ప్రపంచ కప్ లోనూ దుమ్మురేపాడు.

పాక్ పై ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే టి20 ప్రపంచ కప్ లో గ్రూప్‌ దశ తొలి మ్యాచ్‌లోనే మనకు పాకిస్థాన్ ఎదురైంది. చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్. అందులోనూ ప్రపంచ కప్. ఆదివారం సెలవు రోజు.. దీంతో భారత అభిమానులు కళ్లింతలు చేసుకుని చూశారు. 20 ఓవర్లలో పాకిస్థాన్ 159 పరుగులకు కట్టడి చేసిన మన జట్టు ఛేదనలో ఇబ్బందిపడింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విఫలం కావడంతో జట్టు కష్టాల్లో పడింది. స్టార్ హిట్టర్ సూర్య కుమార్ కూడా విఫలం కావడంతో మ్యాచ్ పోయినట్లే అనుకున్నారు.

ఏడు ఓవర్లకే 31 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయిన జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో (40)తో కలిసి కోహ్లి నిలబెట్టాడు. షాహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, హారిస్ రౌఫ్ వంటి పేసర్లను తట్టుకొని అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్ హైడ్రామాలో జట్టును గెలిపించాడు. కాగా, అంతకుముందు రౌఫ్ బౌలింగ్ ముందుకొచ్చి స్ట్రయిట్ గా కొట్టిన సిక్స్, షాహీన్ బౌలింగ్ ఫ్లిక్ తో సాధించిన సిక్స్ హైలైట్ గా నిలిచాయి. మొత్తమ్మీద అతడు పాక్‌పై చేసిన 82 పరుగులు ప్రత్యేకమైనవి. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి భారత్‌కు విజయం చేకూర్చి పెట్టాడు. ఈ క్రమంలో అప్పటి మ్యాచ్‌ను మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గుర్తుకు తెచ్చాడు.

టోర్నీ అంతా చక్కగా..ఆ ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. '' అక్టోబర్ 23వ తేదీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు చాలా
మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఎప్పుడూలేనంత బలమొచ్చినట్లు అనుభూతి కలిగింది.

ఆ సాయంత్రం అద్భుతం'' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేశాడు. కాగా, పొట్టి కప్ టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్‌ కావడం విశేషం. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతడు తర్వాతి మ్యాచ్ లలోనూ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.

విశ్రాంతి తర్వాత వస్తున్నాడు.. మళ్లీ సెంచరీనా టి20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. వచ్చే నెలలో మన జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ కు కోహ్లి బరిలో దిగనున్నాడు. కాగా, 2019 నవంబరులో కోహ్లి బంగ్లాపై గులాబీ టెస్టులో సెంచరీ చేశాడు. నాడు అతడు జట్టు కెప్టెన్. మళ్లీ అప్పటినుంచి
టెస్టుల్లో కోహ్లి సెంచరీనే చేయలేదు. మొత్తమ్మీద చేసినది ఒక్క సెంచరీనే (ఆసియా కప్ లో అఫ్గాన్ పై). ఇప్పుడు కోహ్లికి సెంచరీ చేసే అవకాశం బంగ్లా సిరీస్ రూపంలో
వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News