పేప‌ర్ మిల్లుల‌తో మంత్రి చీక‌టి ఒప్పందాలట‌!

Update: 2017-10-26 04:28 GMT
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధికార టీడీపీ - ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విష‌యం చిన్న‌దైనా.. పెద్ద‌దైనా నేత‌లు స్పందించే తీరు మాత్రం ఒకేలా ఉంటోంది! అస్స‌లు త‌గ్గేదే లేద‌ని ఇరు పక్షాలూ చాలా సంద‌ర్భాల్లో రుజువు చేశాయి. పోల‌వ‌రం - రాజ‌ధాని - రుణ‌మాఫీ ఇలా అంశాల‌న్నింటిలోనూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్షం ఇరుకున పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. దీనిని టీడీపీ నేత‌లు అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ప‌త్తికి మ‌ద్ద‌తు ధ‌రపై ప్ర‌తిప‌క్ష-అధికార నేత‌ల మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రుగుతోంది. ప‌త్తి రైతులకు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైఎస్సార్ సీపీ నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావుపై వైఎస్సార్ సీపీ నేత పార్థ‌సార‌థి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు!

పేప‌ర్‌ మిల్లులతో మంత్రి దేవినేని ఉమ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే గిట్టుబాటు ధర రావడం లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్ధసారథి విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి పేపర్ మిల్లు యాజమాన్యాలను దేవినేని ఉమ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమ పెద్ద బ్రోకర్‌ లా వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్‌ కు మధ్య దేవినేని బ్రోకర్‌ లా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలని బ్రోకర్లను చేసి - రైతులను దోపిడీ చేయించేందుకే 498 జీవో జారీ చేయించారని మండిపడ్డారు.

దుర్భుద్దితోనే మంత్రి దేవినేని ఉమ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.  అలాగే పత్తి రైతులు కూడా కనీస ధరలకు దూరమయ్యారని అన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎందుకు సీసీఐతో పత్తి కొనుగోళ్లు చేయించడం లేదని ప్రశ్నించారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు అధికార పార్టీ నేత‌లు ఎలాంటి స‌మాధానాలు ఇస్తారో వేచిచూడాల్సిందే!!
Tags:    

Similar News