కోమటిరెడ్డి బ్రదర్స్ ది మును'గోడు'యేనా?

Update: 2022-11-06 16:46 GMT
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు.. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్రతం చెడింది.. ఫలితం కూడా దక్కలేదు. అటు తమ్ముడు ఓడిపోయాడు. ఇటు అన్న ఉన్న పార్టీకి డిపాజిట్ దక్కలేదు. మధ్యలో విజయాన్ని టీఆర్ఎస్ కాజేయడంతో ఈ బ్రదర్స్ కు ఇప్పుడు తడిగుడ్డే దిక్కైంది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు వేదికైన మునుగోడులో బీజేపీ తరుఫున పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు.. కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదంటారు. ఫోన్ కాల్స్ చేస్తూ తమ్ముడిని గెలిపించాలని ఆయన చేసిన కాల్స్ కాకరేపాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన వెంకటరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మునుగోడులో తమ్ముడు గెలవలేదు. కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. దీంతో ఈ ఇద్దరు బ్రదర్స్ కు రాజకీయంగా సమాధినే అన్న చర్చ సాగుతోంది.

ఈ మునుగోడు ఫైట్ లో టీఆర్ఎస్, బీజేపీ పంతంలో నిండా మునిగింది మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తమ్ముడు బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ చెడగొట్టుకోగా.. కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిన తమ్ముడిని గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలతో వెంకటరెడ్డి అభాసుపాలయ్యారు. ఇప్పుడు ఇద్దరినీ రెండు పార్టీలు నమ్మే పరిస్థితి లేదు. వీరు వేరే పార్టీల్లోకి వెళ్లే చాన్స్ లేదు. సో రాజకీయంగా వీరి భవిష్యత్ గందరగోళంలో పడిందనే చెప్పాలి.

మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి  మళ్లీ గెలవడం కష్టమేనంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు అన్న చాటు తమ్ముడిగా గెలిచాడు. ఇప్పుడు పార్టీ మారి ఓడిపోతే అన్న పట్టించుకోడు. తిరిగి కాంగ్రెస్ లోకి రాలేడు. ఇటు బీజేపీ నుంచి గెలవలేకపోయాడు. సో రాజగోపాల్ రెడ్డి నిండా మునిగినట్టే అవుతుంది. ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో అసలు ప్రాధాన్యత దక్కదు. మరోసారి గెలిచే ఛాన్స్ ఉండదు.

ఇక తమ్ముడి కోసం సొంత కాంగ్రెస్ నే కాలదన్నేలా కుట్రలు చేసిన వెంకటరెడ్డి రాజకీయాల్లో బ్యాడ్ అయిపోయారు. ఆయనను కాంగ్రెస్ వెలివేసే ప్రమాదం ఉంది. మొత్తంగా బ్యాడ్ అయిపోయి రాజకీయంగా ఎవరూ నమ్మని స్థితికి వెంకటరెడ్డి దిగజారారు. అటు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండక ఇటు బీజేపీలో చేరుదామన్న పిలుపు రాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్రిశంఖు స్వర్గంలో పడిపోతారు.

మునుగోడుతో తొడగొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఓడడమే కాదు.. అన్నయ్య వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ ను ఇరకాటంలో పెట్టేశారు. 18వేల కాంట్రాక్ట్ కోసమే ఆయన చేరారని టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి దారితీసింది. ఇక బీజేపీ ఇస్తామన్న ఆ అతిపెద్ద కాంట్రాక్ట్ కూడా ఓటమితో ఇస్తారో లేదో..

ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ మునుగోడు రాజకీయంగా పెద్ద దెబ్బతీసిందని  పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం చూస్తున్న బీజేపీకి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల బొక్కపడిందనే చెప్పాలి. ఫాంహౌస్ ఎపిసోడ్ కూడా బీజేపీని ఇరుకునపడేసింది. మొత్తంగా మునుగోడుతో ఇటు బీజేపీకి, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు తీవ్ర నష్టమే కలిగిందని చెప్పాలి.
Tags:    

Similar News