మీడియాకి బోర్ కొట్టిందా? ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’ ఎపిసోడ్?

Update: 2022-08-01 08:50 GMT
ఉట్టికే ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా మారింది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’ పరిస్థితి.. కాంగ్రెస్ లో జెండా పీకేసి.. బీజేపీలో నాటేద్దామని తొడగొట్టిన రాజగోపాల్ రెడ్డికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం అయ్యాక ‘15 రోజుల గడువు’ పేరుతో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు.. ఇప్పుడు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేసి ఉప ఎన్నిక తెచ్చుకోవడానికి కోమటిరెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేడట.. అందుకే రెండు భారీ డైలాగులు పెట్టేసి 15 రోజుల గడువు పెట్టి బీజేపీలో చేరకుండా.. కాంగ్రెస్ ను వీడకుండా సరికొత్త రాజకీయం చేస్తున్నారు. బీజేపీలో చేరితే.. కాంగ్రెస్ కు రాజీనామా చేయాలి. మళ్లీ ఉప ఎన్నికలను ఎదుర్కోవాలి. కేవలం రెండేళ్లు మాత్రమే ఇంకా అధికారం ఉంది. ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్లీ గెలవడం కష్టమని అర్థమైంది కనుకనే రాజగోపాల్ రెడ్డి తటపటాయిస్తున్నాడట..

రాజగోపాల్ రెడ్డి వీరావేశంతో బీజేపీలో చేరి ఉప ఎన్నికలు తెస్తాడని.. ఓ మూడు నెలల పాటు ఈ మునుగోడు ఉప ఎన్నికలపై హంగామా చేసి టీఆర్పీ పెంచుకుందామని తెలుగు మీడియా బోలెడన్నీ ప్లాన్లు వేసింది. ఇప్పుడు వీరి ఆశలపై  కోమటిరెడ్డి నీళ్లు చల్లేశాడట.. రాజీనామా చేయకుండా.. బీజేపీలోకి పోకుండా.. కాంగ్రెస్ ను వీడకుండా ‘జాప్యం’ చేస్తున్న కోమటిరెడ్డి తీరు చూసి ఇప్పుడు మీడియాకు బోర్ కొట్టేసిందట.. అందుకే గడిచిన నాలుగైదు రోజుల ముందు వరకూ పుంఖానుపుంఖానులుగా కథనాలు రాసిన మీడియా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి యూటర్న్ చూసి అస్సలు పట్టించుకోవడం లేదు. తమ టీఆర్పీ పై దెబ్బకొట్టాడని రాజగోపాల్ రెడ్డి స్టోరీలు వేయడానికే ఆసక్తి చూపించడం లేదట..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా వార్తలపై చావుకబురు చల్లాగా చెప్పారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం సీనియర్లు ఉత్తమ్, వంశీచంద్ రెడ్డితో భేటి అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక వస్తుందని.. ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది పలకాలన్నారు.ఈ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుందని.. నేను కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నానని కోమటిరెడ్డి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. రాబోయే 15 రోజుల్లోనే తన నిర్ణయం ఉంటుందని రాజీనామాపై కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

అయితే క్షేత్రస్తాయిలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీచేస్తే గెలిచే ప్రసక్తే లేదని నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి తెలిసి వచ్చిందట.. కోమటిరెడ్డి క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారు. సో కోమటిరెడ్డి ఇప్పుడు మునుగోడులో ఒంటరి.. ఇక మునుగోడు అస్సలు బీజేపీకి క్యాడర్, నేతలు లేరు. ఇక డబ్బులన్నీ బడాబాబు అయిన కోమటిరెడ్డినే పెట్టుకోవాలి. ఇంత రిస్క్ చేసి బీజేపీలోకి వెళ్లి గెలుస్తానో లేదో నమ్మకం లేకపోవడంతోనే కోమటిరెడ్డి చేరికను వాయిదా వేశాడని.. 15 రోజుల గడువు పెట్టి తప్పించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కోమటిరెడ్డి తనతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను సమీకరించి వారందరితో కలిపి బీజేపీలోకి వెళదామని అనుకున్నాడని.. కానీ ఈయన కింద ఉండే ముఖ్యమైన కార్యకర్తలే హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. చాలా మంది రాజగోపాల్ రెడ్డితో వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదట.. ఈ క్రమంలోనే తెలంగాణలో తనతోపాటు వచ్చే నేతల కోసం ఎదురుచూస్తూ 15 రోజుల గడువును రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఇంకా కొంతమంది తనతోపాటు బీజేపీలోకి వస్తే తనకు పలుకుబడి ఉంటుందని ట్రై చేస్తున్నాడని.. కానీ రాజగోపాల్ రెడ్డిని నమ్మి వచ్చేవారు లేరని.. కానీ జనాలు ఇతడిపై అంత పాజిటివ్ గా లేకపోవడంతో తటపటాయిస్తున్నాడని సమాచారం. ఒంటరిగా వెళ్లడం ఇష్టం లేకనే 15 రోజుల గడువు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక కోమటిరెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడానికి రెడీ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలను ఢిల్లీలోని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీనియర్ నేత జానారెడ్డికి అధిష్టానం ఫోన్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీలో చేరికలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరుపనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

తెలంగాణలో కోమటిరెడ్డి రాజీనామా చేస్తాడు కావచ్చని.. దుబ్బాక, హుజూరాబాద్ లలోలా మూడు నెలల పాటు మీడియాకు టీఆర్పీ పెంచుకోవడానికి మంచి అవకాశమని తెలుగు మీడియా ఆశపడింది. కానీ కోమటిరెడ్డి తీరుతో ఇప్పుడు వారికి బోర్ కొట్టేసిందట.. ఉప ఎన్నికలు వస్తే ఇంకా మీడియాకు బాగా పని ఉండేదని వాళ్ల ఆలోచనల.. కానీ కోటిరెడ్డి తేల్చుకోలేకపోయేసరికి ప్రజలకు, మీడియాకు ఆయనంటే బోర్ కొట్టేసిందట.. అందుకే కోమటిరెడ్డి వార్తలను ఇప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News