కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వబోయి పరువు తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Update: 2022-10-04 11:30 GMT
మునుగోడు ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అప్పుడే మాటల మంటలు అంటుకున్నాయి. ప్రధానంగా ఇక్కడ అధికార టీఆర్ఎస్ , బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. మధ్యలో కాంగ్రెస్ తన సీటును కాపాడుకునేందుకు గట్టి పోటీనిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల నగారా మోగడం.. కేవలం నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పక్షాలన్నీ అలెర్ట్ అయ్యాయి. మునుగోడులో రాజకీయాలు ఊపందుకున్నాయి.

మునుగోడులో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు నియోజకవర్గంలో మోహరించాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా మాటల తూటాలు సంధిస్తున్నాయి.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 'మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాము ఏమేం చేశామో చెబుతూ.. పోటిలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ మునుగోడుకు ఏ విధంగా అన్యాయం చేసాయో చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ''మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్..  ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ.. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస' అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం మరో ట్వీట్ లో బీజేపీని ఎండగట్టేలా దెప్పిపొడారు. నాడు ప్రధాని వాజ్ పేయి టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడిని పడుకోబెట్టి గోడు వెల్లబోసుకుంటున్న నల్గొండ జిల్లా వాసి కష్టాలను ఎత్తిచూపుతూ బీజేపీని చీల్చిచెండాడాడు.

'ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం..  దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా  ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదు..  తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పింది' అంటూ బీజేపీని డిఫెన్స్ లో పెట్టేలా మంత్రి కేటీఆర్ ఘాటు ట్వీట్లు చేశారు.  

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి పైసా ఇవ్వలేదని.. సమస్య పరిష్కారం కాలేదు అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్యను తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్ లో చెప్పిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పోస్ట్ ద్వారా మునుగోడు ఓటర్లను ఆలోచించేలా చేశారు.

ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వబోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనను తానే విమర్శించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 'మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి? పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టీఆర్ఎస్ కా? ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా?  పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకా' అని ట్వీట్ చేశారు.

కానీ ఇక్కడే కోమటిరెడ్డి దెబ్బై పోయారు. ' ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా?  ' అన్నది తన మీద తనే సెటైర్ వేసుకున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డినే అధికారం కోసం గోడ దూకి బీజేపీలో చేరింది. ఇప్పుడు ఆయన మాటలు ఆయనకే తగులుతున్నాయి. ఇక్కడ గోడ దూకింది 'కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే కదా.. కాంగ్రెస్ లో గెలిచి బీజేపీలోకి దూకింది అతనే కదా.. దీన్ని బట్టి తనను తానే తిట్టించుకున్నాడు. ఇదే ఇప్పుడు కోమటిరెడ్డి పరువు బజారు పాలు చేసేలా తయారైంది. కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వబోయి తన ఇజ్జత్ తానే తీసుకున్నాడని పలువురు గేలి చేస్తున్న పరిస్థితి నెలకొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News