కేసీఆర్‌ ను మళ్లీ సీఎం చేస్తాం: కోమ‌టిరెడ్డి

Update: 2017-07-03 07:04 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఇటీవ‌లి కాలంలో ఒంటికాలిపై లేస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత - సీఎల్పీ ఉప‌నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సూర్యాపేట‌లో మీడియాతో మాట్లాడిన కోమ‌టిరెడ్డి మ‌రోమారు తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ను చేయ‌డానికి సిద్ధ‌మ‌ని అన్నారు. అయితే త‌మ ష‌ర‌తుకు కేసీఆర్ ఒప్పుకోవాల‌ని మెలిక పెట్టారు. ఇంత‌కీ ఆయ‌న పెట్టిన కండీష‌న్ ఏమిటంటే... ఉప ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డం! కేవ‌లం ఉప ఎన్నిక‌ల‌ చాలెంజ్ చేసి ఊరుకోలేదు. 2019 లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా త‌మ ప్ర‌ణాళిక‌లు కొన‌సాగుతున్నాయ‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు. పాదయాత్ర... జైత్రయాత్ర.. దండయాత్రలతో తిరిగి కాంగ్రేస్ పార్టీని అదికారంలోకి తీసుకువస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కేసీఆర్ కు ఓట‌మి భయం పట్టుకుందని,అందుకే దొంగ సర్వేలు చేయిస్తున్నాడని కోమ‌టిరెడ్డి ఎద్దేవా చేశారు. త‌న స‌ర్వేల‌పై కేసీఆర్‌ కు అంత నమ్మకం ఉంటే ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాల‌ని స‌వాల్ విసిరారు. `ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్మూ- ధైర్యం ఉంటే, సర్వేల మీద నమ్మకముంటే, కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేర్చుకున్న 25 మందిని రిజైన్ చేయించి కనీసం 20 మందిని గెలిపించుకుంటే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని ఒప్పించి 2019 లో పోటీ లేకుండా రెండవ సారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తాం` అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సూర్యాపేట - నకిరేకల్ - తుంగతుర్తి స్థానాల్లో ఇలా పాత న‌ల్ల‌గొండ జిల్లాలోని ఏ స్థానంలో గెలిచినా 2019 ఎన్నికల్లో పోటీ చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మెట్టమెదట ఓడిపోయే స్థానంతో పాటు డిపాజిట్ గల్లంతు అయ్యే నియోజక వర్గం సూర్యాపేట నే అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయాన్ని ఒప్పుకున్నారని అన్నారు.

వచ్చే జూన్ నుండి రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇస్తానంటే నమ్మే స్థితిలో తెలంగాణా రైతులు లేరని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. దళిత ముఖ్యమంత్రి తరహాలోనే ఇదీ అబ‌ద్ధ‌మే అన్నారు.  గొర్రెల పంపిణీ స్కీమ్ మెత్తం మోసపూరితమేన‌ని, కులాలా వారిగా దోచుకోవడానికి చేపలు, గొర్రెల పంపిణీ వంటి స్కీమ్ లు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ది పిచ్చి గవర్నమెంట్, పిచ్చి పాలన అని మండిప‌డుతూ ఫన్నీ గవర్నమెంట్ అని వ్యాఖ్యానించారు. రివ్యూలు చేసినట్లు వచ్చే వార్తలు మొత్తం న‌కిలీ అని ఆరోపించారు. పీఆర్వోలతో సమాచారం ఇప్పించి రివ్యూలు అని మభ్యపెడుతున్నారని మండిప‌డ్డారు. తెలంగాణా రాష్ట్రంలో కల్తీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమ‌టిరెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ రైతులను బిక్షగాళ్లుగా మార్చి కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలు కట్టుకుని అనవసర దానాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. నాలుగు కోట్ల మందికి లాభం జరగుతుందని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా రాష్ట్ర్రాన్ని ఇస్తే, నాలుగు కుటుంబాలకు ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవటం వల్ల సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని తెలిపారు. వాస్తు బాగాలేదని సీఎం సచివాలయానికి రాకపోతే ప్రజలు కష్టనష్టాలు ఎవరు చూడాలని ఆయ‌న ప్ర‌శ్నించారు.  గ్రూప్ 2 పరీక్ష ను కూడ సమర్థంగా నిర్వహించలేక తన అసమర్థ‌తను నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  కాంట్రాక్టులు మెత్తం ఆంధ్రా వారికి ఇచ్చి తెలంగాణా ప్రజల సొమ్మును ఆంద్రా వారికి దోచిపెడుతున్నార‌ని మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News