కాంగ్రెస్‌ లో కోమ‌టిరెడ్డి క‌ల‌క‌లం..!

Update: 2019-10-11 09:47 GMT
కాంగ్రెస్ పార్టీ నేత‌లే స్టైలే వేరు.. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మాట్లాడ‌డం క‌న్నా.. ఇష్టారీతిన వ్యాఖ్య‌లు చేయ‌డానికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిపాట్లు ప‌డుతోంది. 2018లో వ‌చ్చిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత ఇప్ప‌టికీ కోలుకోలేక‌పోతోంది. పార్టీ బ‌లోపేతంపై క‌న్నా.. నేత‌లు త‌మ ప‌ద‌వుల గురించే ఎక్కువ‌గా మాట్లాడుతారు. ఎప్పుడు... ఎక్క‌డ.. ఎవ‌రు.. ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఒక‌వైపు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో నువ్వా.. నేనా.. అన్న రీతిలో కాంగ్రెస్‌ - అధికార టీఆర్ ఎస్ మ‌ధ్య పోటీ ఉంది. మ‌రోవైపు.. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

పీసీసీ అధ్యక్ష రేసులో తాను ముందున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. అందరికంటే తానే సీనియర్‌ నని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ పదవి అంటే ఓ బాధ్యత అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ లో విభేదాలు సహజం.. ఉత్తమ్‌ తో విభేదాలు కూడా అందులో భాగమేనన్నారు. ఓ ఛానెల్‌ తో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై పార్టీ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి వ్యాఖ్య‌లు ఉప ఎన్నిక‌లో ప్ర‌తికూల ఫ‌లితాల‌కు దారితీస్తాయ‌ని - గెలుపే ల‌క్ష్యంగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల్సిన ప‌రిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిపోతోందో చూస్తూనే ఉన్నాం. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డం... అక్క‌డ పీసీసీ అధ్య‌క్షుడు భార్య స్వ‌యంగా పోటీ చేస్తున్న వేళ కూడా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఇలా మాట్లాడ‌డంతో ప్ర‌జ‌ల్లోకి చాలా చెడు సంకేతాలు వెళ‌తాయ‌న్న ఆందోళ‌న‌లో పార్టీ రాష్ట్ర నేత‌లు ఉన్నారు. అగ్ర‌నేత‌లే ఇలా పార్టీ శ్రేణుల‌ను గంద‌ర‌గోళ‌ప‌రచ‌డం స‌రికాద‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌కు ముందుకు అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి - పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డిల మ‌ధ్య నెల‌కొన్న మాట‌ల యుద్ధం తెలిసిందే. త‌న భార్య ప‌ద్మావ‌తిరెడ్డి పేరును ఉత్తమ్ ప్ర‌క‌టిస్తే.. త‌న అభ్య‌ర్థి కిర‌ణ్‌ రెడ్డి అంటూ రేవంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఉత్త‌మ్‌ను ఓడించి - టీపీసీసీ ప‌గ్గాలు ద‌క్కించుకోవాల‌న్న వ్యూహంతోనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని అప్ప‌ట్లో టాక్ బ‌లంగా వినిపించింది.

ఆ త‌ర్వాత ఆ స‌మ‌స్య అక్క‌డితో స‌మ‌సిపోగా.. తాజాగా.. టీ పీసీసీ రేసులో తానే ముందున్నానంటూ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మనార్హం. మ‌రోవైపు తానే పీసీసీ అధ్య‌క్షుడిగా ఉంటాన‌ని.. ఈ ప‌ద‌వి మార్పు ఉండ‌ద‌ని ఉత్త‌మ్ చెపుతున్నారు. ఈ నేప‌థ్యంలో హుజూర్‌ న‌గ‌ర్ ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో చూడాలి.


Tags:    

Similar News