టీఆర్ ఎస్‌ లోకి కోమ‌టిరెడ్డి..డేట్ ఫిక్స్‌

Update: 2016-05-22 05:31 GMT
శాసనసభలో కాంగ్రెస్ ఉపనేత - నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వచ్చే నెల 6వ తేదీన కోమ‌టిరెడ్డి టీఆర్‌ ఎస్‌ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. న‌ల్ల‌గొండ జిల్లాలోఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలను కుదిపేస్తోంది.

తాను తెరాసలో చేరుతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని కోమటిరెడ్డి ఖండిస్తున్నప్పటికీ తరుచూ సీఎం కేసీఆర్‌ను పొగుడుతుండడంతో పార్టీ మార్పుపై అనుచరుల్లోనూ సందేహాలు రేగాయి. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసిన తీరును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా వెంకట్‌ రెడ్డి మాత్రం ప్రశంసించడంపై అప్పట్లో కాంగ్రెస్‌ లో దుమారం రేపింది. మ‌రోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ తో వెంకట్‌ రెడ్డికి విభేదాలున్నాయి. తెరాసలో చేరికపై వెంకట్‌ రెడ్డి తన అనుచర వర్గాలతో తీవ్ర తర్జనభర్జనల పిదప జూన్ 6న కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని పార్టీ మార్పుపై కేసీఆర్‌ తో చర్చించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కోమ‌టిరెడ్డి వెంకట్‌ రెడ్డి పార్టీ మార్పుపై న‌ల్ల‌గొండ‌ జిల్లాకు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు కూడా సమాచారమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కోమటిరెడ్డి స్వదేశానికి తిరిగి రాగానే తెరాసలో చేరికపై స్పష్టత నిస్తారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు కోమటిరెడ్డి గతంలో మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించారు. గత ఎన్నికల్లో నల్లగొండ శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిఎల్పీ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి ఒక్కరే తెరాసలో చేరుతారా లేక తన సోదరుడు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో కలిసి చేరుతారా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
Tags:    

Similar News