టీడీపీలోకి కొణతాల - 'దాడి' మొదలవుతుందా..?

Update: 2019-02-25 06:58 GMT
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంలో రాజకీయ వేడి రగులుకుంటోంది. అధికార టీడీపీ, వైసీపీ పార్టీల్లోని నేతలు రోజు ఇటు నుంచి అటూ.. అటు నుంచి ఇటూ జంపింగ్ లు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప్పు, నిప్పులా ఉండే ఇద్దరు నేతలను తన పార్టీలోకి చేర్చుకొని వారిని కలుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో ఉప్పు, నిప్పులా ఉండే కోట్ల-ఈకే - మంత్రి ఆదినారాయణ-రామసుబ్బారెడ్డిలను కలిపారు. తాజాగా మరి ఇద్దరిని కలిపేందుకే బాబు ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరూ కలుస్తారా.? టీడీపీకి సెగ పుట్టిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నేతలు టీడీపీలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎంట్రీ ఖరారైనట్లు సమాచారం. అలాగే మరో నేత దాడి వీరభద్రరావు. దాడి కూడా  టీడీపీకి వస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన వైసీపీ నుంచి బయటికొచ్చాక సైలెంటుగా ఉంటున్నారు.

కొణతాల రామకృష్ణ ఈనెల 28న సీఎం చంద్రబాబుతో భేటి కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రణాళికలతో బాబుతో భేటి అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. చంద్రబాబుతో భేటి అనంతరమే దీనిపై క్లారిటీ రానుంది. అయితే ఇప్పటికే అనకాపల్లి సీటుపై కన్నేసి టీడీపీలో చేరుతున్న సబ్బంహరికి బాబు హ్యాండిస్తాడా అన్న చర్చ సాగుతోంది.

అలాగే కిందటి ఎన్నికల్లో దాడి వీరభద్రరావు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి అనకాలపల్లి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల దాడిని జనసేన అధినేత పార్టీకి రావాలని ఆహ్వానించినా సమాధానం దాటవేశారు. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని చర్చ జరిగింది. అయితే టీడీపీలో వీరిద్దరు చేరితే కొణతాలకు ఎంపీ టికెట్ - దాడికి అనకాపల్లి అసెంబ్లీ స్థానం బాబు ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సబ్బంహరికి మొండిచేయే అన్న చర్చ జరుగుతోంది.

ఇలా చంద్రబాబు ఉప్పు - నిప్పులా ఉండే కొందరు నేతలను తన పార్టీలో చేర్చకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల వరకే ఈ సర్దుబాటు ఉంటుందా? తదనంతరం వీరిలో సఖ్యత ఏమేరకు ఉంటుందని ప్రశ్నార్థకంగా మారింది. బాబు మార్క్ రాజకీయం ఏ మేరకు ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News