ఒకప్పటి జిగిరీ దోస్తుకు షాకిచ్చిన జగన్

Update: 2021-08-04 04:49 GMT
రాజకీయాల్లో బంధాలు.. అనుబంధాలు మహా సిత్రంగా ఉంటాయి. అప్పటివరకు ఒకరికొకరు అన్నట్లుగా ఉండే వారు.. అంతలోనే కత్తులు దూసుకోవటం ఒక్క రాజకీయాల్లోనే కనిపిస్తుంటుంది. ఇలాంటివెన్నో 2019లో జరిగిన ఏపీసార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నాయి. పొద్దున టీడీపీలో ఉండి.. మధ్యాహ్నానానికి పార్టీ మారిపోయిన ఉదంతాలు ఎన్నో. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టకలో జగన్ వెంట ఉన్న అతి కొద్ది మందిలో సీనియర్ నేత కొణతాల రామక్రిష్ణ ఒకరు.

దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆయన కేబినెట్ లో విశాఖ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక మంత్రిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్ అంటే కోసుకునేట్లుగా వ్యవహరించే కొణతాల.. వైఎస్ మరణం తర్వాత జగన్ వైపునకు వచ్చేశారు. చాలామంది నేతల మాదిరి గోడ మీద పిల్లుల మాదిరి ఉండకుండా తన దారి జగన్ దారి అన్నట్లుగా కొణతాల వ్యవహరించారు.

అలాంటి ఆయన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ కు దూరం జరిగి టీడీపీలో చేరారు. నిజానికి ఆయన రాజకీయ కెరీర్ లో ఆయన చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అదేనన్న మాట వినిపిస్తుంటుంది. ఆ విషయాన్నిపక్కన పెడితే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫు పోటీ చేసి ఓడిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి ఆయన తాజాగా వార్తల్లోకి వచ్చారు.

దీనికి కారణం తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే. కొణతాల కుటుంబం చేతిలో దేవాదాయ శాఖకు చెందిన భూములు ఉన్నాయని.. వాటిని ఆ శాఖ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకొని గట్టి షాకిచ్చారంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేనిదే ఇలాంటివి జరగవన్న మాట వినిపిస్తోంది. అనకాపల్లి శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయానికి చెందిన భూములు కొణతాల కుటుంబం చేతిలో ఉన్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. రికార్డుల్లో అవి దేవాదాయ శాఖకు చెందినవేనని తేలినా.. కొణతాల కుటుంబం మాత్రం వాటిని తన చేతిలోనే ఉంచుకున్నట్లుగా చెబుతారు.

తెర వెనుక ఏం జరిగిందో కానీ తాజాగా దేవాదాయ శాఖ అధికారుల్లో చలనం రావటమే కాదు.. తమ శాఖకు చెందిన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం ఏమిటని అనుకున్నారో ఏమో కానీ.. ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని సంచలనంగా మారారు. ఈ ఎపిసోడ్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేవాదాయభూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునే సమయంలో బీజేపీకి చెందిన వారు కూడా పాల్గొని అధికారులకు సపోర్టు చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న అధికారులు ఇప్పుడే చర్యలకు ఉపక్రమించటం ఏమిటన్నదిచర్చగామారింది. మొత్తానికి జగన్ కు ఒకప్పటి సన్నిహితుడైన కొణతాలకు తాజా షాక్ దిమ్మ తిరిగేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News