తెరాస ఖాతాలో తొలి బోణి

Update: 2015-12-10 07:42 GMT
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస వ‌రంగ‌ల్ స్థానాన్ని ఏక‌గ్రీవం చేసుకుంది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ఎవ్వ‌రు నామినేష‌న్ వేయ‌లేదు. ముర‌ళితో పాటు నామినేష‌న్ వేసిన ఐదుగురు స్వ‌తంత్ర్య అభ్య‌ర్థులు ఈ రోజు త‌న నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకోవ‌డంతో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్త‌వానికి ముర‌ళికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చే విష‌యంలో ముందుగా కొద్ది రోజులు హైడ్రామా న‌డిచింది. ఆయ‌న భార్య సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌డంతో సురేఖ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే ముర‌ళికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అధిష్టానం అంగీక‌రించ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే కొండా ముర‌ళి దంప‌తుల‌ను పార్టీలో చేర్చుకునేట‌ప్పుడు కేసీఆర్ సురేఖ‌కు ఎమ్మెల్యే టిక్కెట్టుతో పాటు ముర‌ళికి ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. దీంతో ముర‌ళికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌డంతో సురేఖ‌కు మంత్రి ప‌ద‌వి క‌ష్టమే. జిల్లాలో మొత్తం 859 మంది స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఓట్లు ఉన్నాయి. వీరిలో పార్టీల వారీగా బ‌లాబ‌లాలు చూస్తే తెరాస‌కు 509, కాంగ్రెస్‌ కు 215, టీడీపీ కూట‌మికి 201, ఇత‌రుల‌కు 30 ఓట్లు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షాల ఓట్ల‌న్ని క‌లిపినా కూడా అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది.

చివ‌రి వ‌ర‌కు బరిలో నిలవాలా వద్దా అన్న మీమాంసలో పడ్డ కాంగ్రెస్‌ ఆఖరి క్షణం వరకూ ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. చివరకు డీసీసీబ్యాంక్ చైర్మన్  జంగా రాఘవ రెడ్డితో నామినేషన్ వేయించాలనుకున్నా కుదరలేదు. ఏదేమైనా ఎన్నిక‌లవ్వ‌కుండానే అప్పుడే తెరాస ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బోణి కొట్టేసి ప్ర‌తిప‌క్షాల‌పై ముందే మాన‌సికంగా పైచేయి సాధించింది. కాగా కొండా మురళీ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Tags:    

Similar News