కూతురి కోసం కేసీఆర్ తో ఫైట్ !

Update: 2018-09-08 05:09 GMT
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11మంది  అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పును మాత్రం పెండింగ్ లో పెట్టి కొండా ఫ్యామిలీకి పెద్ద షాకే ఇచ్చాడు. రాజకీయంగా ఇది కలకలం రేపింది. అయితే దీనివెనుక కొండ సురేఖ మొండిపట్టుదలే కారణమని వార్తలు వెలువడ్డాయి. సురేఖ తనతోపాటు తన కూతురికి టిక్కెట్ ఇవ్వాలని కోరడమే ఈ వివాదానికి కారణమని నేతలు విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ రెండు స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం ముదిరి వరంగల్ తూర్పును కూడా వాయిదా వేయడానికి కారణమైందని సమాచారం.  కేసీఆర్ నో చెప్పడంతో ఇప్పుడు కొండా దంపతుల చూపు సొంత గూటిపై పడింది.  వారు ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి రెండు టికెట్ల హామీ లభించినట్టు తెలిసింది. అందుకే శనివారం విలేకరుల సమావేశం పెట్టి ఈ మేరకు కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ప్రకటిస్తారని సన్నిహితుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. అయితే వారు అధికారికంగా ఈ విషయాలను ఎక్కడా వెల్లడించడం లేదు.

 * వివాదానికి కారణమిదే..

కొండా సురేఖ వరంగల్ తూర్పుతోపాటు తమకు ఆదినుంచి పట్టున్న పరకాల టిక్కెట్ ను కూడా ఇవ్వాలని కేసీఆర్ ను కోరారట.. వరంగల్ తూర్పు నుంచి తన కూతురు సుస్మిత పటేల్ ను - పరకాల నుంచి తాను బరిలోకి దిగాలని సురేఖ ప్లాన్ చేశారట.. దీనికి కేసీఆర్ నో చెప్పినట్టు సమాచారం. వరంగల్ తూర్పు మాత్రమే ఇస్తామని.. అది కూడా సురేఖకే ఇస్తామని చెప్పడంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగినట్టు తెలిసింది.  తూర్పులో సురేఖ పోటీచేస్తే ఓకే లేదంటే వారు పార్టీ వీడినా అభ్యంతరం లేదన్నట్లుగా కేసీఆర్ ఉన్నారని సమాచారం. అందుకే ఇప్పటివరకూ కొండా దంపతులను పిలిచి మాట్లాడడం లేదన్నది టీఆర్ ఎస్ ముఖ్యుల మాట..

కొండా దంపతులు రెండేళ్లుగా మూడు నియోజకవర్గాలపై కన్నేసి కార్యక్రమాలు చేస్తున్నారని కేసీఆర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరంగల్ తూర్పుతో పాటు స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిలో కాలు మోపడం.. అక్కడ చారిని అభాసుపాలు చేయడం.. ఆయనపై పూర్తి వ్యతిరేక ప్రచారం కొనసాగించడంపై   కేసీఆర్ సీరియస్ అయ్యారని సమాచారం. హరీష్ చెప్పినా కొండా దంపతులు తీరు మార్చుకోకపోవడంతోనే వారికి టికెట్లు ఇవ్వలేదని తెలిసింది.

కాగా మూడు రోజుల క్రితం వరంగల్ నేతలు కేటీఆర్ ను కలిసి కొండా సురేఖకు టికెట్ ఇవ్వవద్దని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కొండా దంపతులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని.. వారు టీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తారని విన్నవించారు. ఒకటికి మించి నియోజకవర్గాల్లో పట్టు కోసం.. కూతురి టికెట్ కోసమే సురేఖ టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు చెబుతున్నారు.
Tags:    

Similar News