వారిని బాబు దగ్గరకు ఫోన్లతో వెళ్లనీయటం లేదట

Update: 2016-06-01 04:04 GMT
రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ అధికారపక్షం తనకు బలం లేకున్నా నాలుగో స్థానానికి పోటీ చేయనున్నదంటూ ప్రచారం జరగటం.. ఈ సందర్భంగా జగన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున గళం విప్పటం.. బాబు అండ్ కో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయటం తెలిసిందే. అయితే.. మీడియాలో వచ్చిన కథనాలకు భిన్నంగా నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించే విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గినా.. ఆయనపై విమర్శలు చేసే విషయంలో మాత్రం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తమ స్పీడ్ తగ్గించటం లేదు.

తాజాగా జగన్ పార్టీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాని గోవర్దన్ రెడ్డిలు ఆసక్తికర విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయి సైకిల్ ఎక్కేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాబు దగ్గర తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపించారు. చంద్రబాబు దగ్గరకు వీరిని పంపే సమయంలో వారిని తీవ్రంగా అవమానిస్తున్నారని.. వారి సెల్ ఫోన్లను కూడా బాబు దగ్గరకు వెళ్లే సమయంలో అనుమతి ఇవ్వటం లేదన్నారు.

తమ పార్టీ నుంచి వీడిపోయి సైకిల్ ఎక్కేసిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. బాబు పార్టీలో తమకు జరుగుతున్న అవమానాల్ని వారు దిగమింగలేకపోతున్నారంటూ వారు చెప్పుకొచ్చారు. జగన్ పార్టీ నుంచి జంప్ అయి వచ్చిన పార్టీ నేతలతో ఏదైనా తలనొప్పులు ఉంటాయన్న సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న తమ్ముళ్లకు.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు మరింత అయోమయానికి గురి చేస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News