టీడీపీ చిన్న పాము కాదు.. చ‌చ్చిన పాము..!

Update: 2019-07-28 10:47 GMT
అధికారంలో ఉన్న‌ప్పుడు క‌న్నుమిన్ను కాన‌రాక‌.. డ‌బ్బుతో ఏమైనా చేసేయొచ్చు.. ప్యాకేజీల‌తో దేనినైనా సొంతం చేసుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న ఎంత‌లా దెబ్బ తీస్తుంద‌న్న విష‌యాన్ని టీడీపీ అధినేత‌.. ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు తాజాగా అర్థ‌మైన‌ట్లుగా చెప్పాలి. డ‌బ్బుతో కొనుగోలుచేసిన వారెప్పుడు డ‌బ్బు వెంటే ఉంటారే త‌ప్పించి.. పార్టీ త‌ర‌ఫున ఉండ‌ర‌న్న క‌ఠిన నిజం ఆయ‌న‌కు ఇప్ప‌టికైనా అర్థ‌మై ఉంటుందేమో?

చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో టీడీపీని దారుణంగా ఓడించిన ఏపీ ప్ర‌జ‌లు 23 మంది ఎమ్మెల్యేలు ఇవ్వ‌టం ద్వారా.. ఏపీలో బాబుకున్న ఛ‌రిష్మా ఏపాటితో అర్థ‌మైన ప‌రిస్థితి. కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అధికారం కోసం అబ‌ద్ధాలు ఆడే చంద్ర‌బాబును ప్ర‌జ‌లెంతగా ఛీ కొట్టారో ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

పార్టీ ఓట‌మి పాలైన వెంట‌నే.. త‌మ్ముళ్లు ప‌లువురు జంప్ అయిన ప‌రిస్థితి.  ఎవరి దాకానో ఎందుకు చంద్ర‌బాబుకు రైట్.. లెఫ్ట్ హ్యాండ్ అన్నోళ్లే పార్టీ మారిపోగా.. మ‌రికొంద‌రు స‌న్నిహితులు అడ్ర‌స్ కూడా తెలీద‌న్న రీతిలో ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. తాజాగా ఏపీలో టీడీపీ ప‌రిస్థితి చూస్తుంటే.. ఆ పార్టీ ప‌ని అయిపోయిన‌ట్లేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ సీనియ‌ర్ నేత‌..గ‌తంలో వాజ్ పేయ్ ప్ర‌భుత్వంలో కేంద్ర స‌హాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ఈ మ‌ధ్య‌న బీజేపీ వ్య‌వ‌హారాల్లో కాస్త యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం న‌డుస్తున్న పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో హాజ‌ర‌య్యేందుకు భీమ‌వ‌రం వ‌చ్చిన ఆయ‌న‌.. బాబు పైనా.. ఆయ‌న పార్టీ పైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చిన్న‌పామును కూడా పెద్ద క‌ర్ర‌తో కొట్టాలంటార‌ని.. పాము చ‌చ్చిపోయిన త‌ర్వాత ఇక క‌ర్ర ఎందుకు? అంటూ చంద్ర‌బాబు తాజా ప‌రిస్థితి ఎంత‌లా ఉంద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు. ఏపీ విప‌క్ష పార్టీని ఉద్దేశించి.. చ‌చ్చిన‌పాముతో పోల్చిన కృష్ణంరాజు వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

త‌న‌ను కేంద్రం జైల్లో పెడుతుందేమోన‌ని బాబు భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని.. త‌ప్పు చేసినోళ్లకు శిక్ష త‌ప్ప‌ద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో సింప‌తీ కోస‌మే బాబు కావాల‌ని భావోద్వేగ వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని చెప్పిన రెబ‌ల్ స్టార్.. తెలుగు ప్ర‌జ‌లంద‌రికి న్యాయం జ‌ర‌గాలని తాను కోరుకుంటాన‌ని చెప్పారు. ఇన్ని చెబుతున్న కృష్ణం రాజు..త‌మ‌పార్టీ పెద్ద‌లు ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా గురించి కూడా మాట్లాడితే బాగుంటుందేమో?


Tags:    

Similar News