బాబును ఎంత తిట్టినా రెబల్ స్టార్ ను లైట్ తీసుకుంటున్నార‌ట‌!

Update: 2019-07-30 06:39 GMT
రెబల్ స్టార్ గా సుప‌రిచితుడైన సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ప‌డుతున్న అవ‌స్థ‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌న న‌ట వార‌సుడిగా చెప్పుకునే ప్ర‌భాస్ కున్న క్రేజ్ తో త‌న ఇమేజ్ ను పెంచుకుంటున్న పెద్ద మ‌నిషికి ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ గిరి మీద ఆస‌క్తి పెరిగింది. కేంద్రంలోని మోడీ స‌ర్కారు మ‌న‌సు దోచేసి.. ఏదో రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా వెళ్లాల‌న్న ఆయ‌న ఆశ నెర‌వేర‌టం లేదు.

మోడీషాల మ‌న‌సుల్ని దోచుకునేందుకు ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదులో చురుకుగా పాల్గొంటున్న ఆయ‌న్ను ఆశ్చ‌ర్యంగా చూస్తోంది క్యాడ‌ర్‌. బీజేపీకి కృష్ణం రాజు చేసిన దాని కంటే ఎక్కువ‌గా ఆయ‌న ప‌ద‌వుల్ని అనుభ‌వించార‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. కేంద్రంలో వాజ్ పేయ్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కేంద్ర‌స‌హాయ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన కృష్ణంరాజు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సైలెంట్ గా ఉండ‌టం తెలిసిందే.

రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికి కీల‌క‌వేళ‌ల్లో పార్ట్ టైమ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. మోడీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ప‌ద‌వి మీద కొత్త ఆశ‌లు క‌లిగాయి. బాహుబ‌లి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన వేళ‌.. ప్ర‌భాస్ ను ప్ర‌ధాని మోడీ వ‌ద్ద‌కు తీసుకెళ్లి కాసింత హ‌డావుడి చేశారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ప‌ని చేయ‌మంటే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని కృష్ణంరాజుకు.. గ‌వ‌ర్న‌ర్ లాంటి కీల‌క ప‌ద‌విని చేప‌ట్టాల‌న్న కోరిక ఉంది.

అందుకే.. ఆయ‌న తెగ‌ట్రై చేస్తున్నారు. కానీ.. మోడీషాల నుంచి మాత్రం సానుకూల స్పంద‌న రావ‌ట్లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ రాష్ట్రాల్లో నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ల‌ను చూస్తే.. అయితే ఆర్ ఎస్ ఎస్‌.. లేదంటూ హార్డ్ కోర్ బీజేపీ నేత‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ల‌భించింది. అంతేకానీ..కృష్ణంరాజు మాదిరి పార్టీలో ఉన్నామంటే ఉన్నామ‌న్న‌ట్లుగా ఉన్న వారికి దక్కింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా హైక‌మాండ్ క‌న్ను త‌న మీద ప‌డేందుకు కృష్ణంరాజు ఈ మ‌ధ్య‌న రూటు మార్చారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు చ‌చ్చిన పాముతో స‌మాన‌మ‌ని.. ఆయ‌న్ను కొట్ట‌టానికి క‌ర్ర అక్క‌ర్లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కోరుకున్న మైలేజీ రాక‌పోవ‌టంతో ఇదే త‌ర‌హాలో బాబుపై ఆయ‌న త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

టీడీపీతో పొత్తు వేళ బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి గెలిచిన కృష్ణంరాజు.. త‌ర్వాత పార్టీ ప‌వ‌ర్ పోయాక‌.. బీజేపీని వ‌దిలేసి వెళ్లిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. త‌ర్వాతి కాలంలో చిరు ప్ర‌జారాజ్యంలో చేరిన ఆయ‌న‌.. మ‌ళ్లీ మోడీ హ‌డావుడి మొద‌ల‌య్యాక పార్టీలో చేరారు. ఇలాంటి ట్రాక్ రికార్డులు ఉన్న వారికి మోడీషాలు గ‌వ‌ర్న‌ర్ గిరి ఇవ్వ‌ర‌న్న విష‌యం కృష్ణంరాజుకు ఎప్పటికి అర్థ‌మ‌వుతుందో?
Tags:    

Similar News