జగన్‌ కు రాజుల నుంచి ప్రశంసలే ప్రశంసలు

Update: 2019-06-08 11:55 GMT
ఎస్సీలు - ఎస్టీలు.. కురుబ - గౌడ - బోయ - కొప్పుల వెలమ వంటి బీసీ కులాలతో పాటు.. కాపు - కమ్మ - రెడ్డి - రాజు - వైశ్య వంటి అగ్ర కులాలకు.. ఇలా అందరికీ మంత్రివర్గం ప్రాతినిధ్యం కల్పిస్తూ జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్‌ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాజులు జగన్‌ను ప్రశంసించడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.

‘‘సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎస్సీ - ఎస్టీ - బలహీన - మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయమ’’ని కేంద్ర మాజీమంత్రి - బీజేపీ సీనియర్ నేత - రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ - కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని కొనియాడారు. ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు - ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా భావిస్తున్నానంటూ ఆయన ఏకంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

'పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు - డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం. ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా.. పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు 'రాజకీయాల్లో రియల్ హీరో'.. మీరు - మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకం. రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబోతోందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని కృష్ణంరాజు పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీకే చెందిన మరో నేత విష్ణుకుమార్ రాజు కూడా జగన్ పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించారు. జగన్ కేబినెట్ కూర్పు అద్భుతమంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంల ఏర్పాటు వినూత్న నిర్ణయమని విష్ణుకుమార్ రాజు కొనియాడారు. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గం సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు.

కాగా జగన్ మంత్రివర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగనాథరాజుకు కూడా స్థానం దొరికింది. ఆయనకు గృహ నిర్మాణ శాఖ కేటాయించారు.


Tags:    

Similar News