కేటీఆర్ చెప్పారు.. ఎమ్మెల్యేలు అంగ‌డి స‌రుకు కాదని!

Update: 2019-03-05 04:22 GMT
ఎంత ఎమ్మెల్యేలు అయితే మాత్రం.. అంత చుల‌క‌న‌గా క‌నిపిస్తున్నారా?  వారేమ‌న్నా అంగ‌డి స‌రుకా? అమ్ముడు పోవ‌టానికి. అరే.. ఎమ్మెల్యేలాంటి పుణ్య పురుషుల్ని అంతేసి మాట‌లు అన‌టానికి మీకెలా నోరు వ‌చ్చింది?  క‌నీసం ఆలోచించి కూడా మాట్లాడ‌రా?  పార్టీ మార‌టం ఇప్పుడేమైనా కొత్తా?  మా పార్టీకి చెందినోళ్ల‌ను అప్ప‌ట్లో తీసేసుకోలేదు?  అప్పుడేమైనా అన్నామా? అన్న‌ట్లుగా టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గ‌య్యిమంటున్నారు కానీ.. త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని దివంగ‌త మ‌హానేత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ కు నాడు త‌న తండ్రి ఎంత‌లా ఇబ్బంది ప‌డ్డారో.. ఎన్ని శాప‌నార్థాలు పెట్టారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

గ‌తం చాలామందికి న‌చ్చ‌దు. చ‌రిత్ర.. అదో ప‌నికిరాని చెత్త‌గా అభివ‌ర్ణించేటోళ్లు త‌క్కువేం కాదు. కానీ.. గ‌త‌మే వ‌ర్త‌మానానికి మూల‌మ‌ని.. అదే భ‌విష్య‌త్తును దిశానిర్దేశం చేస్తుంద‌న్న స‌త్యాన్ని చాలామంది ఒప్పుకోరు. అయితే.. కాలం చెప్పే పాఠాల‌తో ముందు బోధ‌ప‌డ‌ని త‌త్త్వం త‌ర్వాత అర్థ‌మైనా.. అప్ప‌టికి జ‌ర‌గాల్సిన‌దంతా జ‌రిగిపోతుంది.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రేం చేసినా ప‌ల్లెత్తు మాట అన‌రు. కానీ.. రోజుల‌న్ని ఒక్క‌లా ఉండ‌వ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఎక్క‌డిదాకానో ఎందుకు?  చంద్ర‌బాబు సంగ‌తే చూడండి. ఇర‌వై ఏళ్ల క్రితం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌టానికి నోరు వ‌చ్చేది కాదు. ఈ రోజున వాళ్లు.. వీళ్లు తేడా లేకుండా ఎవ‌రైనా స‌రే బాబు గురించి నాన్ స్టాప్ గా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఈ రోజున రాజ‌కీయాలు ఇంత ద‌రిద్రం కావ‌టానికి కార‌ణం ఆయ‌నేన‌ని మండిప‌డుతుంటారు. ఒక‌ప్పుడు తిరుగులేని నేత‌గా.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా కీర్తిని అందుకున్న ఆయ‌న ఇప్పుడు ఇంత దారుణ‌మైన విమ‌ర్శ‌ల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే.. కాల‌మ‌హిమ‌గా చెప్పాలి.

అన్ని రోజులు ఒక‌టిలా ఉండ‌వు. నాణెనికి ఒక్క ముఖ‌మే ఎప్పుడూ క‌నిపిస్తూ ఉండ‌దు. బొమ్మ ఎంతో.. బొరుసు కూడా అంతే.  కాకుంటే.. చేతిలో ఉన్న అధికారం కావొచ్చు.. క‌లిసి వ‌చ్చే కాలం కావొచ్చు.. ఇంకేదైనా కానీ.. చేసిన ప‌నిని వేలెత్తి చూపించే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే.. అదంతా శాశ్వితం కాదు. తాత్కాలిక‌మే. చేసినదానికి వడ్డీతో స‌హా చెల్లించాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకు ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల తాజా ప‌రిస్థితిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. అందుకే.. అవ‌స‌రానికి అనుగుణంగా చెప్పే హితోక్తులు వీలైనంత త‌క్కువ‌గా చెప్ప‌టం మేలు.

అందునా ఇలాంటి మాట‌ల విష‌యంలో మ‌రింత జాగ‌రూక‌తో ఉండాలి కేటీఆర్. నిన్న మీ నోటి నుంచి వ‌చ్చిన అద్భుత వ్యాఖ్య‌లే చూసుకుంటే.. రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్తు కోసం పార్టీలు మార‌టం.. భవిష్య‌త్తును ఆశించి మ‌రో పార్టీలోకి వెళ్ల‌టం త‌ప్పేం కాదే! అది త‌ప్పు ఎలా అవుతుంది? చ‌ంద్ర‌బాబు పార్టీ మార‌లేదా?  టీడీపీని ఆయ‌న పెట్టించారా?  కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పార్టీలు మారిన వాళ్లు లేరా?  ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. పార్టీ మార‌ట‌మే త‌ప్పు అని.. మారితో అమ్ముడుపోయిన‌ట్లు అని మాట్లాడ‌తారా?  అంటూ కయ్యిమంటున్న కేటీఆర్ ఒక విష‌యాన్ని కాస్త క‌ష్ట‌మైనా గుర్తు తెచ్చుకుంటే మంచిది.

ఇప్పుడు క‌నిపిస్తున్న టీఆర్ ఎస్ లోనూ.. ప‌ద‌వులు అందుకున్న వారిలోనూ ఉద్య‌మ స‌మ‌యంలో నాన్న వెంట ఉన్న వారి కంటే కూడా త‌ర్వాతి కాలంలో వ‌చ్చినోళ్లే ఎక్కువ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. టీఆర్ఎస్ లో చేరిన అనేక మంది నేత‌లు పార్టీ మారి వ‌చ్చిన‌ప్పుడు రాని విమ‌ర్శ‌లు తాజాగా గెలిచిన ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న స‌మ‌యంలోనే రావ‌టాన్ని గుర్తిస్తే మంచిది. అధికారంలో ఉన్న మాకే స‌ల‌హాలా?  అంటే.. అంత సాహ‌సం చేసే శ‌క్తి మాకెక్క‌డిదండి!


Tags:    

Similar News