కేటీఆర్ ఇంతకి మెచ్చుకున్నాడా? త‌ప్పుప‌ట్టాడా?

Update: 2016-11-22 06:21 GMT
వ్యూహాత్మ‌కంగా మాట్లాడ‌టంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - ఆయ‌న రాజ‌కీయ వార‌సుల‌ది అందె వేసిన చెయ్యి. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలోనూ ఆయ‌న త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కే తారక రామారావు ఇదే తీరును అనుస‌రించారు. మొసళ్ళను పట్టుకునేందుకు చేపలను ఎండబెట్టకూడదని, అలాంటి నిర్ణ‌యం స‌రికాద‌ని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకోసం తీసుకునే నిర్ణయాల్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సమర్థిస్తుందని చెప్పారు. అదే సమయంలో అట్టడుగుస్థాయిలో ఉన్న ప్రజల కష్టాల గురించి కూడా కేంద్రం ఆలోచించాలని కేటీఆర్ కోరారు. నోట్ల రద్దుపై ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇక్కడితోనే ఆగిపోకూడదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొంటూ దీనికి ఒక లాజికల్ ముగింపు ఉండాలని కోరారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను కలిసిన కేటీఆర్... అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళడం ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమమని కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానితో భేటీ అయ్యారని చెప్పారు. ఈ నిర్ణయం ఒక్కో సెక్షన్ ప్రజలపై ఏ విధంగా పడుతుందో, ఒక్కో రంగంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుందో వివరించామని తెలిపారు. మొసళ్ళ కోసం చేపలను ఎండబెట్టే విధంగా నిర్ణయం-అమలు ఉండరాదని అన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశానికి మంచిదనే భావన చాలా మంది ప్రజల్లో ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఇక్కడికే పరిమితం చేయకుండా దీనిని ఒక సహేతుకమైన ముగింపు వరకూ తీసుకెళ్ళాలని, మధ్యలోనే ఆపివేయరాదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రాల‌ను కూడా విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల టీమ్ ఇండియా స్ఫూర్తితో వ్యవహరించాలని కేటీఆర్‌ అన్నారు. కేంద్రానికి వచ్చే రెవిన్యూ రాష్ట్రాల నుంచే వస్తున్నదని, రాష్ట్రాల‌కు కూడా నష్టం వాటిల్లుతున్నదని మంత్రి చెప్పారు. రాష్ట్రాల‌కు ఏ మేరకు నష్టం జరుగుతుందో స్వయంగా ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారని, ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాల్సిన అన్ని అంశాలనూ తెలియజేశారని కేటీఆర్ గుర్తుచేశారు. పలు సూచనలను కూడా చేశారని, ఇక వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సింది ప్రధానేనని అన్నారు. ఏదేమైనా ఈ నిర్ణయం వలన వీలైనంత తక్కువ నష్టం లక్ష్యంగా ఉండాలని కేటీఆర్ చెప్పారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ఇంత‌కీ కేటీఆర్ త‌ప్పుప‌ట్టిన‌ట్లా లేక‌పోతే మ‌ద్ద‌తిచ్చిన‌ట్లా అనేది చెప్పిచెప్పిన‌ట్లుగా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. నోట్ల ర‌ద్దును రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర‌సిస్తూ ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో ఇలా ఒకింత త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం కేసీఆర్ ఫ్యామిలీకే చెల్లింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News