గోదారి జిల్లాల పేరును కేటీఆర్ టచ్ చేయకుండా ఉండలేరా?

Update: 2022-02-24 05:51 GMT
ఒక్కో ప్రాంతంలో ఒక్కో గొప్పతనం ఉంటుంది. కలిసి ఉన్నప్పుడు తామున్న ప్రాంతాల గొప్పతనం గురించి చెప్పుకోవటం ఓకే. కానీ.. విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రంలోని గొప్పను చెప్పి.. దాని కంటే మిన్నగా ఉందన్న వ్యాఖ్యలు మరో రాష్ట్రం వాసుల మనోభావాలు దెబ్బ తినేలా ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ పాలకులు ఎందుకు పట్టించుకోరు? అన్నది ప్రశ్న.  తాజాగా జరిగిన భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిధిగా హాజరైన మంత్రి కేటీఆరర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

గోదారి జిల్లాల్లోని ఆందాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో గోదావరి జలాలు ప్రవహించే కాళేశ్వరం ప్రాజెక్టు.. మల్లన్నసాగర్.. కొండపోచమ్మ సాగర్ ల వద్ద షూటింగ్ లు చేయొచ్చని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఫలానా చోట లొకేషన్లు బాగుంటాయని చెప్పటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరుతో పక్క రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్ని ప్రస్తావించి.. అలానే తమ ప్రాంతాలు ఉంటాయని చెప్పటాన్ని తప్పు పడుతున్నారు.

బాగున్నప్పుడు ఒక మాట ఎక్కువ తక్కువ వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తేడా వచ్చి ఎవరికి వారుగా ఉన్నప్పుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాటా కూడా ఆచితూచి అన్నట్లు ఉండాల్సిందే. ఇదే విషయాన్ని బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ చెప్పిన తీరును వంక పెట్టని రీతిలో ఉండటం గమనార్హం.  

50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ మధ్యలో 600ఎకరాల ఐలాండ్ ఉంటుందని.. చుట్టూ నీళ్లు.. మధ్యలో గుట్టలతో ఆ ప్రాంతం ఆకర్షణీయంగా మారుతుందన్న కేసీఆర్.. హాలీవుడ్.. బాలీవుడ్ సినిమాల షూటింగ్ లన్నీ ఇక్కడ జరిగేలా పోటీ పడతాయని పేర్కొన్నారు.

కేసీఆర్.. కేటీఆర్ ఇద్దరు ప్రస్తావించిన అంశం ఒక్కటే అయినా.. విషయాన్ని షోకేస్ చేసే విషయంలో కేటీఆర్ మాటలకు.. కేసీఆర్ మాటలకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థమైపోతుంది. గోదావరి జిల్లాలు ప్రస్తావన తేకుండా తమ గొప్పల గురించి చెప్పుకుంటే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News