మీడియా కథనాల క్లిప్పింగులతో మోడీపై కేటీఆర్ ఫైర్

Update: 2022-07-20 07:30 GMT
తండ్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో.. తాము కత్తి కట్టిన వారిపై విరుచుకుపడటం.. తాము టార్గెట్ చేసిన వారిని తమ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయటం టీఆర్ఎస్ అధినాయకత్వానికి బాగా తెలుసు.

ఇందుకు తగ్గట్లే కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్.. ప్రధాని మోడీపై నిత్యం ఏదో ఒక అంశాన్ని సిద్ధం చేసుకొని మరీ విమర్శించటం.. ఆయన విధానాల్ని తప్పు పట్టే పనిని విజయవంతంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అలాంటిదే మరో పని చేశారు.తాజాగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రధాని మోడీను ప్రశ్నించేందుకు సాయంగా మీడియాలో ప్రచురితమైన కథనాల క్లిప్పింగులను తీసుకున్నారు.

వేర్వేరు మీడియా సంస్థల కథనాల్ని పోస్టు చేసిన ఆయన.. అరుణాచల్ ప్రదేశ్  సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్నినిర్మించినట్లుగా పేర్కొన్న కథనాల్ని సాక్ష్యాలుగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తనకున్న ఆగ్రహాన్ని తెలివిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి.

దేశంలో ద్రవ్యోల్బణాన్ని.. చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానిని మీరేమంటారు? అంటూ ప్రశ్నను సంధించిన ఆయన అందుకు నాలుగు అప్షన్లు ఇచ్చారు.
ఎ. "56"
బి. విశ్వగురు
సి. అచ్చేదిన్ వాలే
డి. పైన పేర్కొన్నవన్నీ.
ఇలా ఆప్షన్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్.. కొసమెరుపుగా ఇటీవల కాలంలో అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటూ కొన్నింటిని పార్లమెంటులో నిషేధించిన వైనాన్ని గుర్తు చేస్తూ.. వ్యంగ్యంగా 'అన్ పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి' అంటూ మరో పంచ్ వేశారు.

ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏ రోజుకు ఆ రోజు సరికొత్తగా ప్రధాని మోడీని ఉద్దేశించి చేస్తున్న ఈ విమర్శలు కమలనాథులకు కేటీఆర్ మీద మరింత కసెక్కించేలా చేస్తున్నాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News