కేటీఆర్ ట్వీట్‌.. పురుషుల‌కు మాత్ర‌మే!

Update: 2017-10-29 04:27 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - మంత్రి కేటీఆర్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నేరుగా స్పందించ‌డ‌మే కాకుండా త‌న ట్విట్ట‌ర్ ద్వారా కూడా సంద‌ర్భాను సారంగా స‌మాధానాలు చెబుతారు. ఏదో ఎవ‌రో ట్వీట్ చేశారులే.. మ‌నం ఎందుకు స్పందించాలి! అనే ధోర‌ణి ఆయ‌న‌లో అస్స‌లు క‌నిపించదు. అంతేకాదు, ప్ర‌ముఖుల పుట్టిన రోజుల‌ను కూడా గుర్తు పెట్టుకుని మ‌రీ ఆయ‌న త‌నదైన స్టైల్‌లో స్పందిస్తారు. గ‌తంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ పుట్టిన రోజు - పెళ్లి రోజుల సంద‌ర్భంగా అదిరిపోయే ట్వీట్ల‌తో టీడీపీ నేత‌ల‌ను సైతం కేటీఆర్ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అదేవిధంగా హైద‌రాబాద్ రోడ్ల‌పై ప‌లువురు ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసే కామెంట్ల‌కు సైతం ఆయ‌న స్పందిస్తూ.. సానుకూల స‌మాధానాల‌తో సంతృప్తి ప‌రుస్తారు. ఇలా స‌మ‌స్య ఏదైనా కేటీఆర్ స్టైలే వేరు అన్న‌ట్టుగా ఆయ‌న ట్విట్ల‌ర్‌ లో కామెంట్ చేస్తుంటారు. దీంతో ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్లు కూడా అధిక‌మే.

అయితే, ఎప్పుడు స‌మ‌స్య‌లు-స‌మాధానాలేనా? అనుకున్నారో ఏమో కేటీఆర్ తాజాగా.. త‌న ట్విట్ట‌ర్‌ లో ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాన్ని పోస్ట్ చేసి అంద‌రినీ న‌వ్వించేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌హిళ‌ల‌కు ఓ విన్న‌పం కూడా చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ కు తెగ లైకులు ప‌డిపోతున్నాయి. మ‌రి ఆ ట్వీట్ ఏంటో - కేటీఆర్ ఎలాంటి స‌బ్జెక్ట్ ఎంచుకున్నారో.. జ‌నాల్ని ఎలా న‌వ్వించారో చూద్దామా..

‘స్వామీజీతో ఓ వ్యక్తి ఇలా అంటున్నాడు: గురూజీ - నా తప్పులు నేను తెలుసుకోవడం ఎలా?

బాబా: సింపుల్ నాయనా.. నీ భార్య చేసిన ఒక తప్పును నువ్వు ఎత్తి చూపు... ఇక నీ ఒక్కడి తప్పులేంటి... నీ స్నేహితులు - బంధువులు అందరి తప్పులను ఆమె ఎత్తిచూపుతుంది.’ ఈ జోక్ ఉన్న ఇమేజ్‌ ను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌... ‘‘దీన్ని షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను.. మీరు పెళ్లయిన మగాళ్లు అయితే ఇది చూసి తప్పక నవ్వుతారు’’ అంటూ ట్వీట్ చేశారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌ను ఉద్దేశిస్తూ.. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ విన్న‌వించారు. దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతుండ‌డం విశేషం. కేటీఆర్ మ‌న‌సులు దోచుకున్నారంటూ మ‌రి కొంద‌రు ట్వీట్ చేశారు.
Tags:    

Similar News