కేటీఆర్ చుట్టూరా సెల్ఫీ బ్యాచ్

Update: 2020-02-05 04:23 GMT
బెల్లం ఉన్న చోటే ఈగలుంటాయని అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారాక రామారావును ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేతలు పడరాని పాట్లు పడుతున్నారట. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో టీఆర్ఎస్ నేతలు తాము కేటీఆర్ మనిషి అనిపించుకునేందుకు తహతహలాడుతున్నారు. కేటీఆర్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారని గ్రహించిన నేతలు ఆయనకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియా నే వాడుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక వంకతో మంత్రి కేటీఆర్ ను కలుసుకొని ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేటీఆర్ దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారు.

త్వరలోనే కేసీఆర్ వైదొలిగి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం జోరందుకోవడంతో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు అన్ని జిల్లాల నుంచి నేతలు తరలివస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రగతి భవన్ కు వెళ్లి మరీ ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగి తాము కేటీఆర్ వర్గం ముద్ర వేయించుకుంటున్నారు. కేటీఆర్ ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని భావనే మెజార్టీ టీఆర్ఎస్ నేతల్లో ఉంది. దీంతో ఆయా నేతలు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు శాయ శక్తులా కష్టపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే స్థాయిలో ఉండే నేతలే కేటీఆర్ వర్గంగా ముద్ర వేయించుకునేందు ప్రయత్నిస్తుండటంతో కింది స్థాయి నేతలు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. కేటీఆర్ వర్గంగా ఉంటే భవిష్యత్లో తమకు మంచి పదవులు దక్కుతాయని వారంతా భావిస్తున్నారు.

అయితే ఈ వ్యవహరంపై ఇప్పటికే కొందరు నేతలు పార్టీ అధిష్టానం దృష్టికెళ్లినట్లు తెలుస్తోంది. కేటీఆర్ గురించి తెలిసిన అధిష్టాన నేతలు దీనిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. కేటీఆర్ ముందు ఇలాంటి సెల్ఫీ బ్యాచుల జిమ్మిక్కులు పని చేయవని వారు చెబుతున్నారు. పార్టీ లో కష్టపడే వారికే పదవులు దక్కుతాయి తప్ప సెల్ఫీ బ్యాచులకు కాదని అధిష్టానం లోని పెద్దలు వారికి భరోసా ఇచ్చి పంపుతున్నారు.
Tags:    

Similar News