2019లో మాదే అధికారం అంటున్న కేటీఆర్‌

Update: 2017-03-25 10:46 GMT
2019 ఎన్నిక‌లు, అందులో టీఆర్ఎస్ గెలుపు గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పూర్తి ధీమా వ్య‌క్తం చేశారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు చేప‌డుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామ‌ని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందని తెలిపారు. పార్టీపట్ల ప్రజల ఆదరణకు పెద్ద ఎత్తున తీసుకుంటున్న స‌భ్య‌త్వాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.  ప్రజలు ఇష్టంతోనే పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. త‌మ అభివృద్ధి-సంక్షేమ కార్య‌క్ర‌మాలు - ప్రజ‌ల మ‌ద్ద‌తుతో 2019లో అధికారం తమదేనని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ త‌న మ‌నోభావాలు పంచుకున్నారు.

ముస్లిం రిజ‌ర్వేష‌న్‌ పై వివాదం చెల‌రేగ‌డం బాధాక‌ర‌మ‌ని కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల్లో వెనుకబాటు తనం ఉందని, ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇవ్వడంలేదని పేర్కొన్నారు. వాళ్లు ముస్లింలు కావడమే బీజేపీ దృష్టిలో తప్పా అని అడిగారు. త‌మిళనాడులో 69 శాతం రిజర్వేషన్‌ లు ఉన్నాయని అదే విధానం మనకు కూడా కావాలని కేటీఆర్ అన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వెసులుబాటుతో ఉండాలని, రాష్ర్టాలకు నిర్ణయాధికారం ఇవ్వాలన్నారు. తమది 90 శాతం వెనుకబడిన వర్గాల ప్రజలు ఉన్న రాష్ట్రమని పేర్కొన్నారు. రిజర్వేషన్ అంశం టీఆర్‌ ఎస్ మేనిఫెస్టోలో ఉందని దానికి ప్రజామోదం ఉందని వివరించారు. ఓసీల్లో పేదలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు పరిషత్ ఏర్పాటు చేశామన్నారు. ఈబీసీలకు కళ్యాణలక్ష్మి - ఫీజు రీయింబర్స్‌ మెంట్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఆకుప‌చ్చ తెలంగాణకు తాము శ్ర‌మిస్తుంటే విప‌క్షాల నేత‌లు కోర్టులో తప్పుడు కేసులు వేస్తున్నారని, కోర్టు కేసులు-ఇతర అవాంతరాల వల్ల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాలకు చిత్తశుద్ది లేదని పేర్కొంటూ తప్పుడు కేసులు వేస్తున్నామని సభలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన మంచిని సీఎం చెబుతున్నారు కానీ తాము చేస్తున్న మంచిని ప్రతిపక్షాలు ఒప్పుకోవడంలేదని కేటీఆర్ ఆరోపించారు. వీలైనన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.  21 ఏళ్ల తర్వాత అన్ని పద్దులపై ఇంత విస్తృతంగా చర్చ జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నమ్ముతున్నామని కేటీఆర్ చెప్పారు.

కాగా, జాతీయ రాజకీయాల గురించి కేటీఆర్ మాట్లాడుతూ యూపీలో గెలుపుతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ బలోపేతం అయ్యాడని విశ్లేషించారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ అన్నట్లు కేంద్రం అనేది మిథ్య అని కేటీఆర్ అన్నారు. రాష్ర్టాలు ట్యాక్స్‌లు కట్టకపోతే కేంద్రానికి నిధులు ఎక్కడివని కేటీఆర్ ప్ర‌శ్నించారు. యూపీలో ఫ‌లితాల‌ను చూసి బీజేపీ ఏదో ఊహించుకుంటుందని ప‌రోక్షంగా తెలంగాణ‌లో బీజేపీకి అవ‌కాశాలు లేవ‌ని వ్యాఖ్యానించారు. కాగా, విప‌క్ష నేత కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గురించి మాట్లాడుతూ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన మాటల్లో స్పష్టతలేదని ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News