బాబు.. లోకేశ్ మీదా ఒక్క పంచ్ వేయ‌ని కేటీఆర్

Update: 2019-04-29 05:30 GMT
అవ‌కాశం వ‌స్తే చాలు.. ఏ మాత్రం విడిచిపెట్ట‌కుండా పంచ్ లు వేసే గుణం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో ఎక్కువే. మిగిలిన వారి సంగ‌తి ఏమో కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్య చేయాల్సి వ‌స్తే ఆయనే మాత్రం త‌గ్గ‌ర‌న్న పేరుంది.

బాబు.. చిన‌బాబుల మీద పంచ్ లు వేసే అవ‌కాశాన్ని ఏ మాత్రం మిస్ కాని కేటీఆర్.. ఇటీవ‌ల కాలంలో అందుకు భిన్న‌మైన తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇటీవ‌ల మీడియాతో చిట్ చాట్ చేసిన సంద‌ర్భంలోకానీ.. తాజాగా సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే స‌మ‌యంలోనూ.. కేటీఆర్ త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

నెటిజ‌న్లు బాబు.. చిన‌బాబు ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ప్పటికి.. ఆచితూచి అన్న‌ట్లుగా కామెంట్లు చేయ‌ట‌మే త‌ప్పించి.. గ‌తంలో మాదిరి ఎట‌కారం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని వైనం క‌నిపిస్తుంది. ఎందుకిలా అన్నదిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ రాజ‌కీయాల మీద విప‌రీత‌మైన ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌టమే కాదు.. ఓపెన్ గా వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం గ‌మ‌నార్హం.

ఏపీలో తాము కోరుకున్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా రానున్న నేప‌థ్యంలో.. ప‌క్క రాష్ట్రాన్ని తాము ప‌ట్టించుకోమ‌న్న సందేశాన్ని ఇచ్చేలా ఆయ‌న తాజా మాట‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా కేటీఆర్ మాట‌లు ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ వంద ట్వీట్లు చేసినా.. మీరొక్క దానికి కూడా జ‌వాబు ఇవ్వ‌లేదు.. ఈసారి ఇవ్వ‌క‌పోతే.. నారా లోకేశ్ మీద ఒట్టు అంటూ ఒక నెటిజ‌న్ చిన‌బాబు ప్ర‌స్తావ‌న తీసుకురాగా.. అందుకు బదులిచ్చిన కేటీఆర్.. మ‌ధ్య‌లో ఆయ‌నేం చేశాడు బ్ర‌ద‌ర్ అనేసి ఊరుకుండిపోయారు. ఏపీ రాజ‌కీయాల మీద త‌న‌కు ఆస‌క్తి లేద‌న్న మాట కేటీఆర్ నోటి నుంచి రావ‌టం విశేషం. ఇక‌.. ఏపీలో జ‌గ‌న్ సీఎం ప‌ద‌వికి అర్హుడ‌ని భావిస్తున్నారా? అన్న సూటి ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. అది ఏపీ ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని చెప్ప‌టం కేటీఆర్ రాజ‌కీయ ప‌రిణితికి చిహ్నంగా చెప్పాలి. త‌న రెండు గంట‌ల ముఖాముఖిలో ఎక్క‌డా బ్యాలెన్స్ మిస్ కాని కేటీఆర్ తీరు చూస్తే.. వ్యూహాత్మ‌కంగా ఏర్పాటు చేసిన అస్క్ కేటీఆర్ కార్య‌క్ర‌మాన్ని తాను కోరుకున్న‌ట్లే ముగించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News