మెట్రోను అడ్డుకున్న అస‌లు కార‌ణ‌మేంది కేటీఆర్‌?

Update: 2017-07-09 06:00 GMT
ఏళ్ల‌కు ఏళ్లుగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ట్రాఫిక్ క‌ష్టాల్ని తీర్చే నాధుడే లేకుండా పోయాడ‌ని చెప్పాలి. ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే అసాధ్య‌మ‌న్న విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మించిన‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర‌చూ గొప్ప‌లు చెబుతూ ఉంటారు. విద్యుత్ క‌ష్టాన్ని త‌మ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా అధిగ‌మించింద‌ని చెప్పే ముఖ్య‌మంత్రికి.. కోటి మందికిపైగా ప్ర‌జ‌లు నిత్యం న‌ర‌కాన్ని చూసే హైద‌రాబాద్ ట్రాఫిక్ క‌ష్టాన్ని ఎందుకు తీర్చ‌లేక‌పోయారో అర్థం కానిది.

అంత పెద్ద విద్యుత్ స‌మ‌స్య‌ను చిటికెలో తీర్చేసిన కేసీఆర్‌ కు..మ‌హాన‌గ‌రంలోని ట్రాఫిక్ స‌మ‌స్య పెద్ద ఇష్యూనే కాదు. మ‌రి.. ఎందుకు ఆయ‌న దృష్టి పెట్ట‌లేద‌న్న‌ది క్వ‌శ్చ‌న్‌. విద్యుత్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాన‌ని చెబితే ఇమేజ్ పెర‌గుతుంది కానీ.. హైద‌రాబాద్ ట్రాఫిక్ క‌ష్టాల్ని తీర్చాన‌ని చెబితే వ‌చ్చే రాజ‌కీయ మైలేజీ త‌క్కువ కావ‌టం కార‌ణ‌మా? అన్న డౌట్ అప్పుడ‌ప్పుడు చాలామందిలో మెదులుతూ ఉంటుంది.

ఇదో అంశ‌మైతే.. హైద‌రాబాద్ ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ చెప్పే స‌త్తా ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతున్న ప‌రిస్థితి. షెడ్యూల్ ప్ర‌కారం ఈ పాటికే ప‌ట్టాల మీద ప‌రుగులు పెట్టాల్సిన మెట్రో.. నేటికీ.. ఎప్ప‌డు స్టార్ట్ అవుతుందో అర్థం కానిది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం సంద‌ర్భంగా ప‌రిమిత రూట్ల‌లో అయినా మెట్రో ప‌రుగులు పెడుతుంద‌ని భావించారు. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.

తాజాగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ను చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. త్వ‌ర‌లోనే మెట్రో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంద‌ని.. కొన్ని కార‌ణాల వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా మెట్రో ప‌నుల్ని ముగించి.. రైలును ప‌ట్టాల‌మీద‌కు తీసుకురావాల‌ని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ భావిస్తున్నా.. అంత‌కంత‌కూ ఆల‌స్య‌మ‌వుతోంది. ఈ ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌టం వెనుక అస‌లు కార‌ణాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు చెప్ప‌ర‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం.. మెట్రో రైలును త‌మ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యంగా చెప్పుకునేందుకు వీలుగా ప్రాజెక్టు ప్రారంభాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఆపుతుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోప‌ణ‌లో అర్థం లేద‌ని.. ఇదంతా అధికార‌పార్టీని ఇబ్బంది పెట్టేందుకే అన్న మాట వినిపిస్తోంది. మెట్రో ఆల‌స్యం వెనుక రాజ‌కీయ కార‌ణ‌మే త‌ప్పించి మ‌రేదీ లేద‌ని.. కావాలంటే మెట్రో ప్రారంభం ఇప్ప‌ట్లో కాద‌ని కొంద‌రు చెప్ప‌టం గ‌మ‌నార్హం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే మెట్రో ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. కావాలంటే చూడాల‌ని వారు వాదిస్తున్నారు. నిజంగా ఈ ఆరోప‌ణ‌ల్లో నిజం ఎంత‌న్న‌ది మెట్రో ప్రారంభ‌మే డిసైడ్ చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అన్ని విష‌యాల్ని ఓపెన్ గా చెప్పేస్తాన‌ని చెప్పే కేటీఆర్‌.. మెట్రో ఆల‌స్యానికి కార‌ణాన్ని కూడా అంతే ఓపెన్ గా చెప్పేస్తే బాగుంటుంది క‌దా?
Tags:    

Similar News