హైద‌రాబాద్ పేరు మార్చే ద‌మ్ముందా? కేటీఆర్ స‌వాల్

Update: 2022-07-04 06:34 GMT
బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో బీజేపీ అగ్రనేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ స‌భ‌లో మాట్లాడిన జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి ర‌ఘుబ‌ర్ దాస్ హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు. కాగా, గ‌తంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ సైతం అనేక‌మార్లు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా.. దీనిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో ఘాటుగా స్పందించారు. బీజేపీ నేత‌లు ముందు అహ్మదాబాద్ పేరును అదానీబాద్‌గా మార్చాల‌ని ఎద్దేవా చేశారు.

ఇంతకీ ఆయన ఎవరు? హైదరాబాద్ పేరు మార్చడానికి అని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ నిల‌దీశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు ఈ ట్వీట్ కు లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

కాగా గుజరాత్ లో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాతే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక అహ్మ‌దాబాద్ గుజ‌రాత్ లో అతిపెద్ద న‌గ‌రంగా ఉంది.

అలాగే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ గౌత‌మ్ అదానీది కూడా గుజ‌రాతే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని మోడీకి బినామీనే గౌత‌మ్ ఆదానీ అనే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ బీజేపీ నేత‌ల‌పై ఫైర్ అవుతూ తాజా ట్వీట్ చేశారు. ముందు అహ్మ‌దాబాద్ పేరును అదానీబాద్ గా మార్చాల‌ని స‌వాల్ చేశారు. మ‌రి కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో.. వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News