బొంతుకు టికెట్ కోసం కేటీఆర్ భారీ స్కెచ్‌!

Update: 2018-09-08 06:15 GMT
పార్టీ నేత ఎవ‌రైనా.. ఎంత‌టి వాడైనా.. చివ‌ర‌కు తెలంగాణ ఇచ్చిన సోనియా కానీ.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ కానీ ఎవ‌రైనా స‌రే.. త‌న నోటి మాట‌ల‌తో పంచ్ ల మీద పంచ్ లు ఇచ్చే గుణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సొంతం. మ‌రి.. అలాంటి ఆయ‌న ఇంట్లో ఎలా ఉంటారు? త‌న తండ్రి క‌మ్ పార్టీ అధినేత అయిన కేసీఆర్  ద‌గ్గ‌ర ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు?  తండ్రికి తాను ఏమైనా చెప్పాల‌నుకుంటే ఎలా చెబుతారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌రంగానే కాదు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బ‌య‌ట ఇంత భారీగా పంచ్ లు వేస్తూ.. అన‌ర్గ‌ళంగా మాట్లాడే కేటీఆర్‌.. త‌న తండ్రి వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ఆయ‌న క‌ళ్ల‌ల్లోకి చూస్తూ మాట్లాడేందుకు సైతం జంకుతార‌ని చెబుతారు. అంతేనా.. తండ్రి ఎదుట కూర్చునే ధైర్యం చేయ‌ర‌ని ఆ కుటుంబంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న వారు చెబుతుంటారు.

కేటీఆర్ తో పోలిస్తే.. ఆయ‌న కొడుక్కే కేసీఆర్ ద‌గ్గ‌ర ఎక్కువ చ‌నువు ఉంద‌ని అంటారు. ఆ మాట‌కు వ‌స్తే ఒక్క‌ కేటీఆర్ మాత్ర‌మే కాదు.. క‌విత‌.. మేన‌ల్లుడు హ‌రీశ్ తో పాటు.. ద‌గ్గ‌ర‌గా ఉంటూ అన్ని ప‌నులూ చూసుకునే బంధువు క‌మ్ ఎంపీ సంతోష్ కూడా కేసీఆర్ అంటే భ‌య‌భ‌క్తులు ఎక్కువ‌ని చెబుతారు. కేసీఆర్ కు తాము ఏదైనా చెప్పాల‌నుకుంటే ఆ విష‌యాన్ని వీలైనంత క్లుప్తంగా చెప్ప‌ట‌మే కాదు..రామాయ‌ణం చెప్పిన‌ట్లుగా చెబుతానంటే కేసీఆర్ ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌న్న మాట‌ను చెబుతారు.

ఇలాంటి వేళ‌.. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కు ఉప్ప‌ల్ సీటు ఇప్పించుకోవ‌టానికి తాజా మాజీ మంత్రి కేటీఆర్ ప‌డుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. బీజేపీతో ఉన్న ర‌హ‌స్య డీల్ పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌ట‌మే ఏమో కానీ.. ఆయ‌న తాజాగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

బొంతుకు సీటు ఇప్పించేందుకు వీలుగా ఆయ‌న భారీ వ్యూహ‌ర‌చ‌న చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ కు బాగా స‌న్నిహితుడైన కేకేను రంగంలోకి దించే ప్ర‌య‌త్నంలో కేటీఆర్ ఉన్నారు. ఇందుకు ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఉప్ప‌ల్ అసెంబ్లీకి ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ చేసిన భేతి సుభాష‌ణ్ రెడ్డి స్థానే బొంతుకు టికెట్ ఇప్పించాల‌ని.. అలా చేసిన ప‌క్షంలో ఖైర‌తాబాద్ టికెట్ ఆశిస్తున్న కేకు కుమార్తెకు మేయ‌ర్ కుర్చీలో కూర్చోబెట్టొచ్చ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో.. మ‌రో కార్పొరేట‌ర్ అయిన విజ‌య‌రెడ్డిని బుజ్జ‌గించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని కేటీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ప్లాన్ ను త‌న తండ్రికి స‌మయం చూసి చెప్పాల్సిన బాధ్య‌త‌ను కేకేకు కేటీఆర్ అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది రానున్న‌రోజుల్లో చోటు చేసుకునే ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News