దావోస్ లో కేటీఆర్ దూకుడు... క‌న‌ప‌డ‌ని ఏపీ ఐటీ మంత్రి

Update: 2020-01-25 05:30 GMT
దావోస్ లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సు లో తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న‌దైన దూకుడు క‌న‌బ‌రిచారు. ఐటీ శాఖ మంత్రిగా మొద‌టి నుంచి త‌న ప్ర‌త్యేక‌త‌ ను చాటుకుంటూ ఉన్న కేటీఆర్.. దావోస్ స‌మావేశంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అక్క‌డ ప్ర‌పంచ వ్యాపార సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో కేటీఆర్ స‌మావేశం అయ్యి.. త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌ముఖ సంస్థ‌ల సీఈవోల‌తో కేటీఆర్ స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌మావేశంలో ప్ర‌పంచ దేశాల్లోని వివిధ నేత‌ల‌ను, భార‌త కేంద్ర‌మంత్రుల‌ను, అలాగే గ్లోబ‌ల్ కంపెనీల ముఖ్య వ్య‌క్తుల‌తో కేటీఆర్ స‌మావేశాలు జ‌రిగాయి. ఆల్ఫాబెట్ ఐఎన్సీ ముఖ్యుల‌తో, గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్,కోక‌కోలా సీఈవో జేమ్స్ క్విన్సే, సేల్స్ ఫోర్స్ ఫైండ‌ర్- చైర్మ‌న్ మార్క్ బెనీఫ్ తో పాటు యూట్యూబ్ సీఈవో సుసాన్ వోసికీ.. వీళ్లంద‌రి తో పాటు సింగ‌పూర్ బిజినెస్ డెలిగేట్స్ తో కేటీఆర్ స‌మావేశం అయ్యారు. వారంద‌రితోనూ ఉమ్మ‌డిగా ఒకే అంశం గురించి కేటీఆర్ ప్ర‌స్తావించి ఉండ‌వ‌చ్చు. త‌మ రాష్ట్రంలో గ‌ల అవ‌కాశాల‌ను చూపించి.. పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించార‌ని తెలుస్తోంది.

ఈ స‌దస్సులోనే ఫార్మా దిగ్గ‌జం ఫిర‌మిల్ గ్రూప్ తో కేటీఆర్ ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఎన్ని పెట్ట‌బుడులు వ‌చ్చే సంగ‌తెలా ఉన్నా.. త‌మ రాష్ట్రంలో ఉన్న అవ‌కాశాల గురించి ఆయ‌న వివ‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

అయితే ఏపీ ప్ర‌తినిధులు మాత్రం డ‌బ్ల్యూఈఎఫ్ లో క‌నిపించ‌లేదు. ఎలాంటి స్టాల్ కూడా ఏర్పాటు చేయ‌లేదు. ఈ విష‌యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి అడ్ర‌స్ లేక‌ పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వేర్వేరు ప‌నుల‌తో చాలా బిజీగా క‌నిపిస్తూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో..ఆయ‌న ఈ స‌మావేశం మీద దృష్టి పెట్టి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను స‌మీక్షించాల్సిన ఐటీ శాఖా మంత్రి గౌత‌మ్ రెడ్డి మాత్రం అస్స‌లు ప‌ట్టించుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సు లో ఏపీ రెప్ర‌జెంటేటివ్ గా హాజ‌రు కాలేదు ఆ మంత్రి. ఒక‌వైపు తెలంగాణ మంత్రి హ‌ల్చ‌ల్ చేస్తే.. ఏపీ ఐటీ మినిస్ట‌ర్ మాత్రం ఈ విష‌యం అస్స‌లు తెలియ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే ఈ మంత్రి ప‌నితీరు అంత గొప్ప‌గా లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సుకు ఈ మంత్రి హాజ‌రు కాక‌ పోవ‌డం మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తూ ఉంది.
Tags:    

Similar News