దావోస్‌ కు చేరిన కేటీఆర్‌..సాయంత్రం బాబు కూడా!

Update: 2018-01-20 08:00 GMT

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో `తెలుగు దంగ‌ల్` జ‌ర‌గ‌నుంది! ఇద్ద‌రు తెలుగు ప్ర‌ముఖులు - ముఖ్యులు త‌మ స‌త్తాను చాటుకునేందుకు దావోస్ చేర‌డ‌మే ఇందుకు కార‌ణం. దావోస్‌లో ఈనెల 23 నుంచి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరగనుంది. ఈ ఆర్థిక సదస్సుకు ప్రపంచదేశాల నుంచి సుమారు 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ కూడా ఈ సదస్సుకు వెళ్తున్నారు. అయితే ఈ స‌ద‌స్సుకు వేదిక‌గా పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌ - త‌మ విధానాల‌ను చాటిచెప్పి మ‌రిన్ని కంపెనీలను రాష్ర్టానికి ర‌ప్పించేందుకు...ఇటు తెలంగాణ‌ - అటు ఆంధ్రప్ర‌దేశ్ రాష్టాలు పోటీ ప‌డుతున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి టీడీపీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దావోస్‌ కు వెళ్తున్నారు. తెలంగాణ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ - ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే తార‌క‌రామారావు హాజ‌రు అవుతున్నారు. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ అక్కడ నుంచే నేరుగా దావోస్ బ‌య‌ల్దేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో పాల్గొనే ముందు జపాన్‌ కు చెందిన జెట్రో సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు అన్న అంశంపై అక్కడ ఆయన మాట్లాడారు. సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. టోక్యోతో పాటు ఒసాకోలో కీలక సెమినార్లు ఆర్గనైజ్ చేసినందుకు మంత్రి కేటీఆర్ జెట్రోకు థ్యాంక్స్ చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే వ్యర్థాలను నియంత్రించాలని, భారతీయ నగరాలకు ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని, స్మార్ట్ నగరాలకు ఈ పద్దతిని తప్పనిసరి చేయాలని మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్‌ లో భావించారు. దీనిలో భాగంగానే టోక్యోకు చెందిన క్లీన్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, దావోస్ పర్యటనకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు దావోస్ త‌న బృందంతో క‌లిసి వెళ్తున్నారు. ఈనెల 24వతేదీ వరకు సీఎం దావోస్ లో పర్యటించనున్నారు. అనంతరం 24వతేదీన దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రానున్నారు.

కాగా, దావోస్ వేదిక‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ ప‌ర్వంలో...ఎవ‌రు ముద్ర‌ను వేసుకుంటారో...ఎవ‌రు ఎక్కువ పెట్టుబ‌డులు సాధిస్తారో అనే ఆస‌క్తి తెలుగు రాష్ర్టాల్లో నెల‌కొంది.
Tags:    

Similar News