కెలికి మ‌రీ బుక్ కావ‌టం కేటీఆర్ ద‌గ్గ‌రే నేర్చుకోవాల‌ట‌!

Update: 2019-05-03 06:30 GMT
కాల మ‌హిహ అంటే దీన్నే చెప్పుకోవాలి. కాలం క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌డూ తోపులే. త‌మ‌కు మించిన మొన‌గాడు మ‌రొక‌రు ఉండ‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వారి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే టైం మంచిగా న‌డుస్తున్న‌ప్పుడు.. ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. తిరుగులేద‌న్న‌ట్లుగా ఉంటుంది. కానీ..  కాలం ఎప్పుడైతే తేడా కొట్ట‌టం మొద‌ల‌వుతుందో.. మామూలుగా చెప్పిన విషయాలు కూడా వెంటాడి వేధిస్తూ ఉంటాయి.

తాజాగా అలాంటి అనుభ‌వ‌మే క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావుకు ఎదురైంద‌ని చెప్పాలి. ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాల వెల్ల‌డిలో కేసీఆర్ స‌ర్కారు అడ్డంగా బుక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏదైనా విపత్తు ఎదురైన‌ప్పుడు.. మౌనంగా ఉండ‌టం.. ఎలాంటి స్పంద‌న లేన‌ట్లుగా ఉంటూ.. కాల‌మే దానికి స‌మాధానం చెబుతుంద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు అల‌వాటు.

తెర మీద‌కు రాకుండా..తెర వెనుక ఆందోళ‌న‌ల్ని.. నిర‌స‌న‌ల్ని ఎలా అణిచివేయాలో సుదీర్ఘ‌కాలం ఉద్య‌మ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు. దీనికి త‌గ్గ‌ట్లే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. తాజాగా ర‌గులుతున్న ఇంట‌ర్ బోర్డు వివాదం విష‌యంలో మాత్రం కేసీఆర్ అంచ‌నాలు అడ్డంగా ఫెయిల్ అవుతున్నాయి. ఆయ‌న ఎత్తులు అస్స‌లు పార‌టం లేదు.

ఎప్ప‌టిలానే త‌న‌దైన ట్రేడ్ మార్క్ మౌనాన్ని ప్ర‌ద‌ర్శించిన కేసీఆర్‌.. ఇంట‌ర్ బోర్డు వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు.. రీవాల్యువేష‌న్.. రీవాల్యువేష‌న్ కు ఫీజుల లేకుండా చేయ‌టం లాంటివి చేప‌ట్టారు. దీంతో.. ఇష్యూ అయిపోయిన‌ట్లే అనుకున్న వేళ‌.. అత్యుత్సాహంతో కేటీఆర్ చేప‌ట్టిన ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాం ఇష్యూ మ‌ళ్లీ ర‌గిలేలా చేశార‌ని చెప్పాలి.

ఇంట‌ర్ వివాదంలో ప్ర‌ముఖంగా వినిపించిన గ్లోబ‌రీనా కంపెనీ త‌న‌కు అస్స‌లు తెలీద‌ని.. వారి గురించి అవ‌గాహ‌నే లేద‌న్న‌ట్లుగా చెప్పిన కేటీఆర్ మాట‌ల్ని ప‌ట్టుకొని.. గ‌డిచిన నాలుగు రోజులుగా ఉతికి ఆరేస్తున్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయ‌న మాట‌లుఎంత స్థాయికి వెళ్లాయంటే.. ఆయ‌న‌ది క‌ల్వ‌కుంట్ల వంశ‌మే అయితే కోర్టులో కేసు వేయాల‌ని కెలికారు. కేటీఆర్ కేసు వేస్తే.. తాను చేసిన ఆరోప‌ణ నిజ‌మేన‌ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

రేవంత్ ధీమాను చూసినోళ్లంతా ఆశ్చ‌ర్య‌పోతుంటే.. ఈ ఇష్యూపై నోరు విప్ప‌టానికి సందేహిస్తున్న కేటీఆర్ మౌనం కొత్త అనుమానాల్ని పెంచేలా ఉంద‌ని చెబుతున్నారు. రేవంత్ చెప్పిన‌ట్లుగా కేటీఆర్ కానీ ప‌రువున‌ష్టం దావా వేస్తే.. ఆయ‌న మాట‌ల‌కు విలువ ఇచ్చిన‌ట్లు అవుతుంది. అలా అని.. కేసు వేయ‌కుంటే.. మౌనం కొత్త సందేహాల‌కు తావిచ్చేలా చేస్తుంది. ఇదంతా చూస్తున్న గులాబీ నేత‌లు.. లేనిపోని కంపను క‌దిలించి మ‌రీ మా చిన్న బాస్ మీదేసుకున్నారంటూ వాపోతున్నారు. సమిసిపోయే అంశాన్ని అస్క్ కేటీఆర్ పేరుతో కెలుక్కున్న చిన్న‌బాస్ య‌వ్వారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News