కుమార‌స్వామి..ఓ వివాహం..వివాదం..అదృష్టం

Update: 2018-05-20 11:30 GMT
అనేక ఉత్కంఠ ప‌రిణామాల మధ్య క‌న్న‌డ రాజ‌కీయాలకు ఫుల్ స్టాప్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ ర‌థ‌సార‌థి మిగ‌తా రెండు జాతీయ పార్టీల‌కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ...సీఎం అయ్యారు. త‌ద్వారా మ‌రోమారు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. కుమార‌స్వామి జీవితం అనేక ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక కావ‌డం విశేషం. అదృష్టం..వివాహం...వివాదం ఇలా కీల‌క అంశాల‌న్నీ సినీ నిర్మాత నుంచి సీఎంగా ఎదిగిన కుమార‌స్వామి జీవితంలో భాగం అయ్యాయి. మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు 1959 డిసెంబర్ 16న జన్మించిన కుమారస్వామి బెంగళూరులోని నేషనల్ కాలేజీలో బీఎస్సీ చదివారు. హెచ్‌ డీ కుమారస్వామి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా - డిస్ట్రిబ్యూటర్‌ గా వ్యవహరించారు. 1996 ఎన్నికల్లో కనకపుర స్థానం నుంచి తొలిసారి విజయం సాధించడంతో కుమారస్వామి రాజకీయ అరంగ్రేటం చేసినా.. 1998 లోక్‌ సభ మధ్యంతర ఎన్నికలు, 1999 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. 2004లో రామనగర స్థానం నుంచి గెలుపొందారు.

ఆనాడు కర్ణాటకలో తొలిసారి జేడీఎస్ కాంగ్రెస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా కాంగ్రెస్ నేత ధరంసింగ్ - ప్రస్తుత మాజీ సీఎం - నాటి జేడీఎస్ నేతగా సిద్దరామయ్య డిప్యూటీ సీఎంగా పని చేశారు. అయితే 2006లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి జేడీఎస్ వైదొలుగడంతో ధరం సింగ్ సీఎంగా రాజీనామా చేశారు. 2006 ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి 2007 అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు బీజేపీ మద్దతుతో కుమారస్వామి సీఎంగా తొలిసారి పని చేశారు.

2009లోనూ పార్లమెంట్‌ కు ఎన్నికైన కుమారస్వామి.. తాజాగా కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రెండుస్థానాల నుంచి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీటీఐతో మాట్లాడుతూ తాను కింగ్ మేకర్‌ను కాదని, కన్నడ ప్రజలు తనను కింగ్ కావాలని కోరుకుంటున్నారని కుమారస్వామి చెప్పారు. ఆశించిన‌ట్లుగానే కింగ్ అయ్యారు.

కాగా కుమార‌స్వామి వైవాహిక జీవితం వివాదాల్లో ప‌డింది. 1986 మార్చి మూడో తేదీన అనితను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నారు. 2006లో కన్నడ నటి రాధికను కూడా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి షామికా కే స్వామి అనే కూతురు ఉన్నది. ఆయన రెండో పెండ్లిపై కేసు దాఖలైనా ఆధారాల్లేవని కర్ణాటక హైకోర్టు కొట్టేసింది.
Tags:    

Similar News