హరిద్వార్ లో కుంభమేళా: భక్తుల్లో భయంభయం.. స్థానికుల్లో కలవరం!

Update: 2021-04-17 03:15 GMT
ఉత్తరాఖండ్ లో కుంభమేళా జరుగుతోంది. ఈ వేడుకలకు లక్షలాది మంది జనం, సాధువులు, స్వామీజీలు హాజరయ్యారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇలాంటి కష్టకాలంలో కుంభమేళా నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భాజపా పాలిత రాష్ట్రంలో ఈ కరోనా కాలంలో కుంభమేళా రద్దు చేస్తే బాగుండేదని నిపుణులు అంటున్నారు. లక్షలాదిగా జనం తరలివచ్చారు. కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. ఇబ్బడిముబ్బడిగా బయట తిరిగారు. ఈ క్రమంలో వైరస్ చాలా మందికి సోకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కుంభమేళా అనంతరం హరిద్వార్ లో డేంజర్ బెల్స్ మోగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
 
'మార్చి 9న ఉదయం హరిద్వార్ చేరుకున్నాను. ఎయిర్‌పోర్టులోగానీ, హరిద్వార్‌లోగానీ ఎవరూ తనిఖీలు చేయలేదు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టును అసలు చూడలేదు. నేను ఫొటోలు తీస్తున్న సమయంలో చాలామంది గుమిగూడి ఉన్నారు. ఎవరూ మాస్కు వేసుకోలేదు. కొందరు వేసుకున్నా ముక్కు, మొహాన్ని కవర్ చేసుకోలేదు. ఎక్కడా భౌతిక దూరం పాటించలేదు. సంధ్యాహారతి సమయంలో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. మూడు రోజులు అక్కడ గడిపాను. ఆ తర్వాత హోం ఐసోలేషన్ లో ఉంటున్నా. అయినా భయంగానే ఉంది.'

-కుంభమేళాకు వెళ్లొచ్చిన ఫొటోగ్రాఫర్

దేశంలో కరోనా పెరిగి కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవు. చివరకు అంత్యక్రియలకు శ్మశానాల్లో టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కుంభమేళాను రద్దు చేస్తే బావుండేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఒకేసారి లక్షలాది మంది గుమిగూడడాన్ని స్పైడర్ ఈవెంట్ గా అభివర్ణిస్తున్నారు.

కుంభ్ అనగా మతపరమైన ఆచార వ్యవహారాలని అర్థం. మతాన్ని ఎలా కాపాడుకోవాలనే అంశంపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతారు. హిందూ మత పరిరక్షణ కోసమే అనేక వేదికలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు.  సమస్యలు ఎలా పరిష్కరించాలనే అంశాలపై చర్చించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతూ కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

హరిద్వార్ లో ఉండే ప్రజల్లో భయం నెలకొంది. కొవిడ్ సమయంలో భక్తులు పోటెత్తడంతో ఎక్కడి నుంచి ఎక్కడకు వైరస్ వ్యాపిస్తుందోనని భయంభయంగా గడుపుతున్నట్లు వాపోయారు. భక్తి పేరిట కరోనా నిబంధనలు గాలి కొదిలేశారని వాపోయారు. అక్కడ రోజూ ఎన్ని కేసులుంటాయో చూడాలని ఆందోళన చెందుతున్నారు. కుంభమేళా నిర్వహణపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కుంభమేళా భక్తుల్లో భయం, స్థానికుల్లో కలవరం రేపుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Tags:    

Similar News