త‌గ్గేదేలే.. మ‌రోమారు వేడెక్కిన కుప్పం!

Update: 2022-08-30 06:44 GMT
టీడీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోమారు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు మూడు రోజుల కుప్పం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ నేత‌లు దాడులు, ప్ర‌తిదాడుల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట రామ‌కుప్పం మండ‌లంలో కొల్లుప‌ల్లిలో చోటు చేసుకున్న గొడ‌వ ఆ త‌ర్వాత కుప్పం ప‌ట్ట‌ణంలో ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది.

ఈ దాడుల్లో టీడీపీ నేత‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. పోలీసులు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుతోపాటు ప‌లువురిని అరెస్టు చేశారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించ‌నీయ‌కుండా వైఎస్సార్సీపీ నేత‌లు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌ను కూడా చించేశారు.

ఈ వివాదం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య తీవ్ర స్థాయి విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. అయితే వైఎస్సార్సీపీ నేత‌లు ధ్వంసం చేసిన అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించి వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. ఈ నేప‌థ్యంలో కుప్పంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థి నెలకొంది. ఆగ‌స్టు 29న సోమ‌వారం అర్థరాత్రి అన్నక్యాంటీన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు, తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అన్నక్యాంటీన్‌ దగ్గరకు చేరుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడి వుంటారని టీడీపీ నేతలు విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు కుప్పంలో ఒక్క‌సారిగా ఉద్రిక్త‌తలు పెరిగాయి.

అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వ‌ద్ద గ‌త‌ 86 రోజులులగా క్యాంటీన్ నిర్వ‌హిస్తున్నామ‌ని లోకేష్ తెలిపారు. అర్థరాత్రి వైఎస్సార్సీపీ చేసిన‌ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు.  వైసీపీ పాలనలో మొత్తం 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని నిప్పులు చెరిగారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. అన్నక్యాంటీన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మెజారిటీని వైఎస్సార్సీపీ బాగా తగ్గించింది. ఆ త‌ర్వాత పంచాయ‌తీ, మండ‌ల ప‌రిష‌త్, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ సంచ‌ల‌న ఫ‌లితాలు న‌మోదు చేసింది. అత్య‌ధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. చివ‌ర‌కు కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీనే ద‌క్కించుకుంది.

ఈ నేప‌థ్యంలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జ‌గ‌న్ కుప్పంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇటీవ‌ల 66 కోట్ల రూపాయ‌లు కుప్పం అభివృద్ధికి నిధులు విడుద‌ల చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ను కూడా కుప్పం నుంచే ప్రారంభించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా గెలిపించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. త‌న‌కు పులివెందుల ఎలాగో.. కుప్పం కూడా అలాగేన‌న్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ చంద్ర‌బాబు ఇటీవ‌ల ప‌ర్య‌ట‌న‌కు ఆటంకాలు సృష్టించింద‌ని అంటున్నారు. ఇప్పుడు మ‌రోమారు అన్న క్యాంటీన్‌పై దాడితో ప‌రిస్థితులు చేయిదాటిపోయేలా క‌నిపిస్తున్నాయి.
Tags:    

Similar News