ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: క‌ర్నూల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ పై వేటు

Update: 2020-04-30 13:35 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న 15 జిల్లాల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలు జిల్లా కూడా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనే అత్య‌ధిక‌ అపాజిటివ్ కేసులు - మరణాల రేటు క‌ర్నూలు జిల్లాలో ఉంది. అందుకే ఈ జిల్లాను కేంద్ర ప్ర‌భుత్వం డేంజ‌ర్ జోన్‌లో చేర్చింది. అయితే దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్పందించింది. కరోనా వైరస్ క‌ట్ట‌డిలో విఫ‌ల‌మైన క‌ర్నూలు జిల్లా యంత్రాంగంపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలో క‌ర్నూలు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై వేటు వేసింది.

క‌రోనా తీవ్ర ప్రభావం చూపుతుండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే కర్నూలులో వైరస్ విజృంభిస్తోందని గుర్తించి దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ఈ సంద‌ర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుపై బదిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలు మున్సిప‌ల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి డాక్టర్ బాలాజీని నియమిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌లపై క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించార‌ని, వారి ఉదాసీన వైఖ‌రితోనే వైరస్ అదుపులోకి రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలోనే అత్య‌ధికంగా 350కి పైగా కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. దీంతో ముఖ్య‌మంత్రి జగన్ స్పందించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌స్తుతం మున్సిపల్ కమిషనర్‌పై మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకున్నారు. భ‌విష్య‌త్‌ లో మ‌రింత మందిపై చ‌ర్య‌లు తీసుకుంటార‌ని చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో క‌ర్నూలు జిల్లా అధికార యంత్రాంగంలో వణుకు మొదలైంది. మరిన్ని కఠిన చ‌ర్య‌లు తప్పదనే సంకేతాలు వ‌స్తున్నాయి.



Tags:    

Similar News