క‌ర్నూలు జ‌డ్పీ చైర్మ‌న్ మార్పు.. రీజ‌నేంటి?

Update: 2021-12-18 15:49 GMT
వైసీపీలో అధినేత మాటే శిరోధార్యం అని నాయ‌కులు మ‌రోసారి నిరూపించుకున్నారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ కే పెద్ద‌పీట వేశారు. తాజాగా క‌ర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి మ‌ల్కిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రాజీనామా చేశారు. నిజానికి ఆయ‌న చైర్మ‌న్‌గా ఎన్నికైంది ఇటీవ‌లే. అయితే.. ఇంత‌లోనే.. కొన్ని అనివార్య కార‌ణాలు వ‌చ్చాయి. దీంతో జ‌గ‌న్ ఆదేశాలు.. అభ‌యం మేర‌కు ఆయ‌న త‌న ప‌ద‌వికి రిజైన్ చేశారు. మ‌ల్కిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వడంతో వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు.

ముందు నిర్ణ‌య‌మే!

కర్నూలు జిల్లా పరిషత్ ఎన్నిల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో జ‌డ్పీ చైర్మన్ పదవిని వైసీపీ సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఇవ్వాలని మొదట అధిష్టానం భావించింది. కొలిమిగుండ్ల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటరెడ్డి దురదృష్టవశాత్తు కరోనాతో మృతిచెందారు. దాంతో సంజామల జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డిని అనుకోని విధంగా చైర్మన్ పదవి వరించింది. అయితే, ఎర్రబోతుల కుటుంబంలో ఎవరైనా జడ్పీటీసీగా గెలిస్తే వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని పార్టీ ముందుగానే నిర్ణయించింది.

పాపిరెడ్డి గెలుపుతో..

కొలిమిగుండ్ల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కొడుకు పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తండ్రికి ఎలానూ.. చైర్మ‌న్ గిరీ ఇస్తామ‌ని హామీ ఇచ్చాం క‌నుక‌.. ఆయ‌న కుమారుడు పాపిరెడ్డికిఇవ్వాల‌ని పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలోనే చైర్మ‌న్‌గా ఉన్న‌ వెంకట సుబ్బారెడ్డిని రాజీనామా చేయాలంటూ గత వారం రోజులుగా కోరింది. అయితే, క‌నీసం ఏడాది కూడా కాకుండానే రాజీనామా చేస్తే.. తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందిగా మారుతుంద‌ని.. వెంకటసుబ్బారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే రాజీనామా చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది.

జ‌గ‌న్ జోక్యంతో..

చివరికి ఈ అంశంపై సీఎం జగన్ జోక్యం చేసుకుని వెంక‌ట సుబ్బారెడ్డికి రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు వెంకటసుబ్బారెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టర్ కోటేశ్వరరావు కు అందించారు. దీంతో ఎర్రబోతుల పాపిరెడ్డి కి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పాపిరెడ్డి ని చైర్మన్‌గా ఎన్నుకోవాలని నిర్ణయించారు.
Tags:    

Similar News