బాబు వైఎస్సార్ రోజుకు రెండు మూడు సార్లు... అదే పచ్చి నిజం...

Update: 2022-11-17 01:30 GMT
ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ ది ఒక శకం. ఆయన పొలిటికల్ లెజెండ్. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుది కూడా మరో చరిత్ర. ఇద్దరూ తెలుగు నాట రాజకీయాల్లో తమదైన చరిత్రను సృష్టించుకున్న వారు ఇద్దరూ ఇద్దరే అని కూడా చెప్పాలి. చిత్రమేంటి అంటే ఈ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి.

ఇద్దరూ పక్క పక్క జిల్లాలకు చెందిన వారు. ఈ ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకేసారి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే ఈ ఇద్దరిలో చంద్రబాబు తొమ్మిదేళ్ల  ముందు సీఎం అయితే ఆ తరువాత వైఎస్సార్ సీఎం అయ్యారు. ఇక సీఎం గా రెండు సార్లు వైఎస్సార్ పనిచేసారు. మొత్తంగా అయిదుంపావు ఏళ్ళు ఆయన ఉమ్మడి ఏపీని పాలించారు.

చంద్రబాబు ముమ్మారు సీఎం గా పనిచేసి పద్నాలుగేళ్ల పాటు పాలించారు. ఇలా ఇద్దరూ యోధానుయోధులు. అలాంటి ఈ ఇద్దరూ మంచి మిత్రులు ఒకనాడు. ఆ తరువాత రాజకీయంగా చూస్తే టీడీపీ కాంగ్రెస్ గా విడిపోయి ఎదురు నిలిచి పోరాడుకున్న ప్రత్యర్ధులు. అయినా ఈ ఇద్దరి మధ్య స్నేహ బంధమే ఎక్కువగా ఉండేది. మొదట్లో అయితే ఒకే కంచం, ఒకే మంచం అన్నట్లుగా ఈ ఇద్దరు నేతలూ ఉండేవారు అని వారిని ఎరిగిన వారు చెబుతారు.

అయితే రాజకీయంగా వైఎస్సార్ ఫ్యామిలీతో నారా ఫ్యామిలీ తలపడుతున్న వేళ ఈ విషయాలు చెబితే ఎవరూ నమ్మలేని పరిస్థితి. అంతవరకూ ఎందుకూ చంద్రబాబే ఏకంగా కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా హాజరైనపుడు తాను వైఎస్సార్ జిగినీ దోస్తులమని చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు తానూ వైఎస్సార్  చాలా  మంచి స్నేహితులుగా ఉన్నామని చెబుతూ గతాన్ని  గుర్తు చేసుకున్నారు.  అయితే ఈ విషయాన్ని మాత్రం వైసీపీ నేతలు ఎవరూ నమ్మలేదు. పైగా బాబు చెప్పేది రాజకీయం కోసమని విమర్శలు కూడా చేశారు. కానీ ఇది పచ్చి నిజం అని ఆ ఇద్దరికీ సమకాలీనుడు. పైగా వైఎస్సార్ కి ఆత్మ లాంటి కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు చెప్పాకా ఇక నమ్మక తప్పదు కదా.

ఇపుడు అదే జరిగింది. వైసీపీకి అనుకూలం అని పేరుపడిన ఒక వెబ్ చానల్ లో కేవీపీ ఈ గుట్టుని విప్పారు. వైఎస్సార్, చంద్రబాబు మంచి మిత్రులే అని ఆయన చెప్పడం విశేషం. 1977 నుంచి మొదలైన ఈ ఇద్దరు స్నేహం చంద్రబాబు  1983 లో   టీడీపీలో చేరే వరకూ కొనసాగింది అని కేవీపీ సంచలన కామెంట్స్ చేశారు.

అది కూడా ఈ ఇద్దరు మిత్రులూ రోజుకు రెండు మూడు సార్లు అయినా కనీసం  మాట్లాడుకునేవారని కేవీపీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి వైసీపీ వారితో సహా అందరి కళ్ళూ తెరిపించేశారు. కేవలం వైఎస్సార్ బాబు మాత్రమే కాదు, మేం కూడా కలిసి తిరిగేవాళ్లమని గత స్మృతులను నెమరేసుకున్నారు.

అయితే  చంద్రబాబు  టీడీపీలో చేరిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఇద్దరూ కలవడం జరిగింది లేదని కేవీపీ అన్నారు. ఇక తాను కూడా చంద్రబాబుకు సన్నిహితునిగానే అప్పట్లో ఉండేవాడిని అని కేవీపీ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు బాలయ్య ఓటీటీ షోలో చెప్పినది అబద్ధం కాదని, పచ్చి నిజమని కేవీపీ సాక్షిగా  బల్లగుద్ది చెప్పినట్లు అయింది. మరి ఇంతలా కేవీపీ చెప్పాక ఇకనైనా వైసీపీ నేతలు నమ్ముతారా ఆ ఇద్దరి మధ్య ఒకనాటి స్నేహ బంధం గట్టిది బలమైనది అని అని అంతా అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News