వైఎస్..బాబు చేసిన ప‌నులేంటో చెప్పిన కేవీపీ

Update: 2017-11-30 14:48 GMT
పోలవరం నిర్మాణాన్ని ఆపాలంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాయడం, పోలవరంపై తాజాగా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న‌ నేపథ్యంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌న్నిహితుడు - కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని ఆయ‌న మండిప‌డ్డారు. పోలవరం నిర్మాణ వ్యయం పెరిగితే పూర్తిగా భరిస్తామని కేంద్రం చెప్పిందని ఆయన అన్నారు. పోలవరం నిర్మాణంలో అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తాను పార్లమెంటులోనే చెప్పానని కేవీపీ అన్నారు. కేంద్ర ప్రాజెక్టుకు నాబార్డు రుణం ఎందుకు తీసుకోవాలో తనకు అర్ధం కావడం లేదన్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు విషయంలో నీతి ఆయోగ్ చెప్పిన విషయాలను ఏపీ సీఎం చంద్ర‌బాబు వక్రీకరిస్తున్నారని కేవీపీ విమర్శించారు. పోలవరం నిర్మాణానికి అన్ని అనుమతులూ తీసుకువచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని కేవీపీ పున‌రుద్ఘాటించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలన్న నిర్ణయం కాంగ్రెస్ దేనని కేవీపీ తెలిపారు.పెండింగ్ కేసులు పరిష్కారమయ్యే వరకూ పోలవరం నిర్మాణాన్ని ఆపాలన్న ఒడిశా సీఎం డిమాండ్ అర్ధరహితమని  అన్నారు. పోలవరంపై ఒడిశా సీఎంకు అవగాహన లేదన్నారు. పోలవరం విషయంలో కేంద్ర -ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని కేవీపీ రామచంద్రరావు త‌ప్పుప‌ట్టారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా వాస్తవాలను వెల్లడించాలని కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు.

ఎంత వ్యయం అయినా పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించి తీరాలని కేవీపీ స్పష్టం చేశారు. పోలవరం కోసం నాబార్డు రుణం రాష్ట్రం తీసుకోవడం…దానికి కేంద్రం చెల్లిస్తాననడం ఏమిటో తనకు అర్ధం కావడం లేదని కేవీపీ పేర్కొన్నారు.పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని, కేంద్రం స్వయంగా ఈ విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు.
Tags:    

Similar News