కూట‌మి పిలుపు నాదే: ర‌మ‌ణ

Update: 2018-11-24 07:46 GMT
కాంగ్రెస్‌ - తెలుగుదేశం.. రెండు భిన్న ధ్రువాలు. బ‌ద్ధ శ్ర‌తువులుగా భావించుకునే పార్టీలు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌ పై వ్య‌తిరేక‌త‌తో. కానీ - ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారిపోయాయి. భిన్న ధ్రువాలు క‌లిపిసోయాయి. శ‌త్రువుల మ‌ధ్య స్నేహ‌బంధం వెల్లివిరిసింది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇరు పార్టీలు క‌లిసిపోయాయి. కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. మ‌రో రెండు పార్టీల‌ను త‌మతో చేర్చుకున్నాయి.

ఈ అనూహ్య మార్పున‌కు కార‌ణం ఎవ‌రు? ప్ర‌జా కూట‌మి ఏర్పాటు వెనుక కీల‌క పాత్ర పోషించింది ఎవ‌రు? ఎవ‌రు చొర‌వ తీసుకుంటే ఇది సాధ్య‌మైంది? చాలామందికి ఆస‌క్తి క‌లిగిస్తున్న ఈ ప్ర‌శ్న‌ల‌కు శుక్ర‌వారం మేడ్చ‌ల్‌ లో కాంగ్రెస్ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో స‌మాధానం దొరింకింది. మూడు ప్ర‌శ్న‌ల‌కు ఒక‌టే స‌మాధానం.. అదే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ పేరు.

అవును. కూట‌మి ఏర్పాటుకు పిలుపునిచ్చింది తానేన‌ని ఎల్‌.ర‌మ‌ణ నిన్న మేడ్చ‌ల్ స‌భ‌లో స్వ‌యంగా ప్ర‌క‌టించారు. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి ఓ తెలుగుదేశం పార్టీ నేత మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన దొర తానే సీఎం అయ్యారంటూ కేసీఆర్‌ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసిన రోజే తెలంగాణ సమాజ ఆత్మగౌరవం కాంగ్రెస్‌ తో కలవాలని సీపీఐ నేత చాడ వెంక‌ట‌రెడ్డి - తెలంగాణ జ‌న స‌మితి కోదండరాంలతో తాను చెప్పానని రమణ తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన ఆత్మవిశ్వాస‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. త‌న మాట‌ను గౌర‌వించినందుకు చాడ‌ వెంక‌ట్‌ రెడ్డి - కోదండ‌రాంల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. కూట‌మి ఏర్పాటుకు కాంగ్రెస్ కూడా చాలా కృషి చేసింద‌ని తెలిపారు.
Tags:    

Similar News